త్వరగా అందుబాటులోకి రెమ్‌డెసివిర్‌!

కొవిడ్‌-19 రెండోదశ విజృంభణతో ఆసుపత్రుల పాలవుతూ, ‘రెమ్‌డెసివిర్‌’ మందు కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మందుకు ఎన్నడూ లేనంత కొరత ఏర్పడినందున, తయారీ పెంచి, సత్వరం బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఔషధ కంపెనీలు,

Updated : 01 May 2021 08:38 IST

‘స్టెరిలిటీ క్లియరెన్స్‌’ సమయాన్ని తగ్గించిన ప్రభుత్వం
రాబోయే వారాల్లో సరఫరా పెరిగే అవకాశం
ఉత్పత్తి పెంచుతున్న హెటెరో డ్రగ్స్‌ సహా ఇతర ఫార్మా కంపెనీలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 రెండోదశ విజృంభణతో ఆసుపత్రుల పాలవుతూ, ‘రెమ్‌డెసివిర్‌’ మందు కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మందుకు ఎన్నడూ లేనంత కొరత ఏర్పడినందున, తయారీ పెంచి, సత్వరం బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఔషధ కంపెనీలు,  ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి. ఈ చర్యల వల్ల వచ్చే కొద్ది వారాల్లో ‘రెమ్‌డెసివిర్‌’ లభ్యత బాగా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. రెమ్‌డెసివిర్‌ మందును మనదేశంలో జైడస్‌ క్యాడిలా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, జుబిలెంట్‌ ఫార్మా, హెటిరో డ్రగ్స్‌ తయారు చేస్తున్నాయి. ఉత్పత్తి పెంచాల్సిందిగా ఈ కంపెనీలకు ఇటీవల ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. తమ యూనిట్లలో ఈ ఔషధ ఉత్పత్తిని బాగా పెంచామని, వచ్చే వారం నుంచి తమ సరఫరాలు పెరుగుతాయని హెటిరో డ్రగ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర కంపెనీలూ ఉత్పత్తిని బాగా పెంచాయి. ప్రభుత్వం కూడా విదేశాల నుంచి 4.50 లక్షల ఇంజెక్షన్లు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ వెసులుబాటు వల్లే
రెమ్‌డెసివిర్‌ మందు తయారీ చేపట్టిన రోజు నుంచి 20 రోజులకు కానీ మార్కెట్లోకి అందుబాటులోకి రాదు. తయారీ ప్రక్రియకు తోడు దీనికి ‘స్టెరిలిటీ క్లియరెన్స్‌’ ఇవ్వడానికి ఔషధ నియంత్రణ సంస్థలు 15 రోజుల సమయం తీసుకుంటాయి. అందువల్లే డిమాండ్‌కు తగ్గట్లు తయారు చేసి, సరఫరా చేయలేని స్థితి నెలకొంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ‘స్టెరిలిటీ క్లియరెన్స్‌’ ఇవ్వడానికి పట్టే సమయాన్ని 7 రోజులకు తగ్గించింది. దీంతో ఉత్పత్తి, లభ్యత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
వాస్తవానికి మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ.. తదితర ప్రాంతాల్లో ‘రెమ్‌డెసివిర్‌’ మందుకు తీవ్రమైన కొరత ఉంది. ఆసుపత్రులకే సరఫరా కావలసిన ఈ మందును, ‘మా వల్ల కావడం లేదు, మీరే తెచ్చుకోండి’ అని వైద్యులే రోగుల బంధువులకు సూచిస్తున్నారు. దీంతో స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తూ.. ఈ ఔషధం ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు వస్తుంది... అనే వెతుకులాటలో అల్లాడిపోతున్నారు. కంపెనీలు నిర్ణయించిన ధర కంటే ఎంతో అధిక ధరకు దళార్ల నుంచి కొనుగోలు చేస్తున్న ఉదంతాలు ఎన్నో. ఒక్కో రోగికి 6 ఇంజెక్షన్లకు ఖర్చు గరిష్ఠంగా రూ.21,000 కాగా, దానికి లక్ష- లక్షన్నర రూపాయల వరకు దళారులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని