Stock market: 3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు.. జొమాటో షేర్లలో జోష్‌

Stock market closing bell: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 480 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

Updated : 04 Aug 2023 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల (Stock market) నష్టాలకు బ్రేక్‌ పడింది. మూడు రోజుల వరుస నష్టాల అనంతరం సూచీలు కోలుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, టీసీఎస్‌ వంటి ప్రధాన షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లు పెంచడంతో అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అయితే, ఇవాళ యూఎస్‌ జాబ్‌ డేటా రానుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సెన్సెక్స్‌ 65,453.55 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. లాభాల పరంపర రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 65,799.27 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 480.57 పాయింట్ల లాభంతో 65,721.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.35 పాయింట్ల లాభంతో 19,517.00 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.84గా ఉంది. సెన్సెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌ టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

నోకియా కేసులో సుప్రీంలో ఒప్పోకు ఎదురుదెబ్బ!

జొమాటో జూమ్‌: జొమాటో షేర్లలో ఎప్పుడూ లేని కొత్త జోష్‌ కనిపించింది. త్రైమాసిక ఫలితాల్లో తొలిసారి ఆ కంపెనీ రూ.2 కోట్ల లాభాన్ని ప్రకటించడం ఇందుకు నేపథ్యం. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఓ దశలో 14 శాతం మేర రాణించి రూ.98.39 వద్ద 18 నెలల గరిష్ఠానికి చేరింది. చివరికి  10.68% లాభంతో 95.43 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని