Nokia vs Oppo: నోకియా కేసులో సుప్రీంలో ఒప్పోకు ఎదురుదెబ్బ!

Nokia vs Oppo: పేటెంట్‌ ఉల్లంఘన కేసులో ఒప్పోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సమర్థించింది. 

Updated : 04 Aug 2023 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పేటెంట్‌ ఉల్లంఘన కేసులో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ఒప్పోకు (Oppo) సుప్రీంకోర్టులో (Supreme court) ఎదురుదెబ్బ తగిలింది. నోకియా (Nokia) దాఖలు చేసిన ఈ కేసులో గతంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. దేశీయంగా జరిపిన విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో 23 శాతం నగదును డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. దిల్లీ కోర్టు ఆదేశాలు పాటించేందుకు ఒప్పోకు మూడు వారాలు గడువు ఇచ్చింది. పది రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది.

నోకియా పేటెంట్‌ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఒప్పో.. ఆ సంస్థతో 2018లో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 5జీ డివైజులకు టెక్నాలజీని వాడుకునేందుకు అనుమతి లేదు. దీనికి తోడు ఒప్పందం గడువు ముగిశాక కూడా టెక్నాలజీని ఒప్పో వినియోగించుకుందని నోకియా పేర్కొంది. ఇలా దాదాపు 7 కోట్ల డివైజులను దేశీయంగా విక్రయించినా.. ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా తమకు రాయల్టీ రూపంలో చెల్లించలేదని పేర్కొంది. ఇదే విషయమై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

‘ఐటీ రిఫండ్‌.. అని మెసేజ్‌ వచ్చిందా..?’: కేంద్రం హెచ్చరిక

దేశీయంగా జరిపిన విక్రయాల ద్వారా వచ్చిన 23 శాతం మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని కోర్టు ఒప్పోను ఆదేశించింది. దీనిపై ఒప్పో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోకియా పేర్కొంటున్న మూడు పేటెంట్లలో రెండు పేటెంట్లు వేరే జురిడిక్షన్లలో రిజెక్ట్‌ అయ్యాయని పేర్కొంది. అయితే.. తమ టెక్నాలజీ ఆధారంగానే హార్డ్‌వేర్‌ ప్రొడక్షన్‌ చేపట్టిందంటూ నోకియా పేర్కొని.. ఒప్పో వాదనలను తిప్పికొట్టింది. ఇప్పటికే ఐటీ శాఖ, డీఆర్‌ఐ పరిశీలనలో ఉన్న ఒప్పో సంస్థ సొమ్ము డిపాజిట్‌ చేయడం ముఖ్యమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దిల్లీ  హైకోర్టు వాదనలను సమర్థిస్తూ ఒప్పో పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతున్నందున తాము కలగజేసుకోవడం సబబు కాదని అభిప్రాయపడింది. గతంలో ఇదే వ్యవహారంలో జర్మనీలో ఒప్పో నిషేధం ఎదుర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని