Petrol Prices: మళ్లీ పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు?

సామాన్యుడిపై మళ్లీ చమురు భారం పడనుందా..? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా..? ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను చూస్తే అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

Published : 20 Jan 2022 14:22 IST

దిల్లీ: సామాన్యుడిపై మళ్లీ చమురు భారం పడనుందా? పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలు పెరగనున్నాయా? అంతర్జాతీయ పరిణామాలను చూస్తే అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు (Crude Oil) ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరడంతో రానున్న రోజుల్లో దేశంలోనూ చమురు ధరల మోత ఉండే అవకాశముందని చెబుతున్నారు.

25 శాతం పెరిగిన ముడిచమురు ధర

  • గతేడాది దేశంలో రికార్డు స్థాయిలో పెరిగి చుక్కలు చూపించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ మధ్యే కాస్త స్థిరంగా ఉన్నాయి. దీంతో సామాన్యులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత నాలుగు వారాల్లో ముడి చమురు ధర ఏకంగా 25 శాతం పెరగడం గమనార్హం.
  • డిసెంబరు 1న బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ 69 డాలర్లు పలకగా.. బుధవారానికి 88.38 డాలర్లకు పెరిగింది. మరికొద్ది రోజుల్లో 100 డాలర్లకు ఎగబాకే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • రష్యా, యూఏఈ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు ఇరాక్‌ నుంచి టర్కీ వెళ్లే ఓ ఇంధన పైపు లైనులో సమస్యలు తలెత్తి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. 
  • ఈ పరిణామాలు దేశీయంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగానే దేశీయ చమురు తయారీ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరిస్తుంటారు.
  • గతేడాది రికార్డు స్థాయిలో పెరిగి లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధర ఏకంగా రూ.100 దాటేసిన విషయం తెలిసిందే. దీంతో 2021 నవంబరులో కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సుంకాన్ని తగ్గించింది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలూ చమురుపై వ్యాట్‌ తగ్గించడంతో ఇంధన ధరలు కాస్త దిగొచ్చాయి. 
  • గత రెండు నెలలుగా చమురు సంస్థలు ధరలను సవరించకుండా స్థిరంగా ఉంచాయి. అయినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధర ఇంకా ఎక్కువగానే ఉందనేది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.41గా ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ కాస్త అటూ ఇటూగా రూ.90 పైనే పలుకుతోంది.
  • ఇప్పుడు ముడి చమురు ధరలు పెరగడంతో మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ ధరలు నిత్యావసరాలపైనా ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని