Stock Market Update: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి....

Updated : 06 Jul 2022 16:27 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఇటీవలి కనిష్ఠాల నేపథ్యంలో దిగువ స్థాయిల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు చైనాలో ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, చమురు ధరలు దిగిరావడం దేశీయ సూచీల సెంటిమెంటును పెంచింది. ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్‌ తగ్గకపోవడం కలిసొచ్చింది. వాహన విక్రయాలు పుంజుకోవడం, కమొడిటీ ధరలు నెమ్మదిగా కిందకు రావడం కూడా మార్కెట్లకు సానుకూలంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణించడం విశేషం. ఆసియా పసిఫిక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌, ఐరోపా మార్కెట్లు ప్రస్తుతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 53,170.70 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 53,819.31 - 53,143.28 మధ్య ట్రేడయ్యింది. చివరకు 616.62 పాయింట్లు లాభపడి 53,750.97 వద్ద ముగిసింది. 15,818.20 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 16,011.35 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 15,800.90 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 178.95 పాయింట్లు ఎగబాకి 15,989.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ వరుసగా రెండోరోజు 16,000 మార్క్‌ను తాకడం గమనార్హం.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* స్పైస్‌జెట్‌ విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సంస్థకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇంట్రాడేలో ఓ దశలో కంపెనీ షేర్లు దాదాపు 7 శాతం మేర నష్టపోయాయి. కానీ, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో చివరకు 2.25 శాతం లాభంతో ముగిశాయి.

* ఫెమా నిబంధనల ఉల్లంఘన విషయంలో విచారణ ఎదుర్కొంటున్న పలు క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఈడీ బుధవారం నోటీసులు జారీ చేసింది.

* హీరోమోటోకార్ప్‌ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోనున్నాయన్న వార్తల నేపథ్యంలో షేర్లు రాణించాయి.

* కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై సానుకూల పవనాల నేపథ్యంలో ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేర్లు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. గత రెండు వారాల్లో ఈ షేరు 29 శాతానికి పైగా లాభపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని