Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: సెన్సెక్స్‌ 180 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

Published : 06 Feb 2023 09:34 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 205 పాయింట్ల నష్టంతో 60,635 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 68 పాయింట్లు నష్టపోయి 17,785 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.46 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గతవారాన్ని నష్టాలతో ముగించాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నుంచి దేశీయ మార్కెట్లు ప్రభావితం కావచ్చు. ఆర్‌బీఐ ఈసారి వడ్డీ రేట్లు పెంచొచ్చని, అయితే వేగాన్ని తగ్గించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదానీ గ్రూప్‌ పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెట్టొచ్చు. డిసెంబరు పారిశ్రామికోత్పత్తి, బ్యాంక్‌ డిపాజిట్లు, రుణాల వృద్ధి గణాంకాలను మదుపర్లు పరిశీలించే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచీ మదుపర్లు సంకేతాలు తీసుకోవచ్చు.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టాటా స్టీల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎస్‌జేవీన్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌, ఇన్ఫిబీమ్‌ అవెన్యూస్‌, కోల్టే పాటిల్‌, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌, తమిళనాడు పెట్రో ప్రోడక్ట్స్‌, యునికెమ్‌ ల్యాబ్స్‌, విశాక ఇండస్ట్రీస్‌, వీమార్ట్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

ఐటీసీ: డిసెంబరు త్రైమాసికంలో ఐటీసీ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,070.09 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,118.80 కోట్లతో పోలిస్తే ఇది 23.09% అధికం.  అన్ని విభాగాల్లో బలమైన వృద్ధి ఇందుకు తోడ్పడింది. కార్యకలాపాల ఆదాయం రూ.18,365.80 కోట్ల నుంచి 3.56% అధికమై రూ.19,020.65 కోట్లకు చేరింది.

బ్రైట్‌కామ్‌ గ్రూప్‌: హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 52.48 శాతం, నికరలాభం 51.15 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

ఎస్‌బీఐ: ఎస్‌బీఐ ఎన్నడూ లేనంత త్రైమాసిక నికరలాభాన్ని అక్టోబరు-డిసెంబరులో నమోదు చేసింది. రూ.15,477 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం    రూ.9,555 కోట్లతో పోలిస్తే ఇది 62% అధికం. వడ్డీ ఆదాయంలో వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగవ్వడం ఇందుకు దోహదం చేసింది.

భారతీ ఎయిర్‌టెల్‌: టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వద్ద ఉన్న 23.01 శాతం ఇండస్‌ టవర్స్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు నియంత్రణ సంస్థలకు శనివారం సమాచారమిచ్చింది.

టాటా పవర్‌: టాట పవర్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.1,052.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.551.89 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. మొత్తం ఆదాయంరూ.11,018.73 కోట్ల నుంచి రూ.14,401.95 కోట్లకు పెరిగింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) ఏకీకృత నికర లాభం 74.76 శాతం వృద్ధితో రూ.4,305.66 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడానికి తోడు, అధిక వడ్డీ ఆదాయం ఇందుకు దోహదం చేశాయి.

దివీస్‌ లేబొరేటరీస్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,822 కోట్ల ఆదాయంపై రూ.307 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.2,510 కోట్లు, నికరలాభం రూ.902 కోట్లు ఉండటం గమనార్హం.

ఇండిగో: విమాన ప్రయాణాలకు గిరాకీ పెరగడంతో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ రాణించింది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,422.6 కోట్లకు చేరుకుంది. 2021-22 ఇదే కాల లాభం రూ.129.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం సైతం రూ.9,480.1 కోట్ల నుంచి రూ.15,410.2 కోట్లకు పెరిగింది.

పేటీఎం: డిసెంబరు త్రైమాసికంలో పేటీఎం ఏకీకృత ప్రాతిపదికన రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల నష్టం రూ.778.4 కోటతో పోలిస్తే ఈ సారి బాగా తగ్గింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,456.1 కోట్ల నుంచి రూ.2,062.2 కోట్లకు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని