RBI: ప్రపంచంతో పోలిస్తే భారత ఆర్థిక పరిస్థితి మేలే: ఆర్‌బీఐ

ఇన్ని అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని ఆర్‌బీఐ పేర్కొంది....

Updated : 27 May 2022 15:44 IST

ముంబయి: కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం గణనీయంగా తగ్గనుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సహా అనేక అవాంతరాలు ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసురుతున్నాయని తెలిపింది. ముడి సరకుల కొరత, ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల వంటి సమస్యలు తిరిగి జటిలమవుతున్నాయని వార్షిక నివేదికలో పేర్కొంది. కరోనా వ్యాప్తి, చైనాలో లాక్‌డౌన్‌లు, పారిస్‌ పర్యావరణ లక్ష్యాలు ఆర్థిక వ్యవస్థ మందగమనానికి మరికొన్ని కారణాలని తెలిపింది.

ఇన్ని అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. ఫలితంగా పునరుత్తేజం బలంగానే ముందుకు సాగుతోందని.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేసే ఇతర అంశాలూ క్రమంగా బలపడనున్నాయని తెలిపింది. మరోవైపు వృద్ధికి ఊతమివ్వాల్సిన తరుణంలో ద్రవ్యోల్బణం ఎగబాకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సవరించాల్సి వస్తోందని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ఆర్‌బీఐ ఇటీవల కీలక వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే.

సుస్థిర, సమతుల, సమ్మిళిత వృద్ధికి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని ఆర్‌బీఐ తన నివేదికలో నొక్కి చెప్పింది. సంక్షోభం ప్రభావాన్ని అధిగమించడానికి కూడా ఇవి చాలా అవసరమని పేర్కొంది. సరఫరా వ్యవస్థల్లోని సమస్యల పరిష్కారం, ద్రవ్యోల్బణ కట్టడికి ద్రవ్య విధానంలో మార్పులు, మూలధన వ్యయాన్ని పెంచడంపైనే భవిష్యత్తు వృద్ధి పథం ఆధారపడి ఉంటుందని వివరించింది. మరోవైపు టోకు ద్రవ్యోల్బణం ఎగబాకడం వల్ల ఆ ప్రభావం రిటైల్‌ ద్రవ్యోల్బణం పైనా ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని