Updated : 26 Mar 2022 12:31 IST

Stock Market: స్టాక్స్‌ కొనేముందు ఈ 10 విషయాలు గుర్తుంచుకోవాలి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు ఈ మధ్య భారీ కుదుపులకు లోనయ్యాయి. దిగ్గజ కంపెనీల షేర్లు సైతం కనిష్ఠాలకు దిగొచ్చాయి. దీంతో తక్కువ ధర వద్ద కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ, కష్టపడి సంపాదించిన డబ్బును ఊరికే అలా మదుపు చేయడం ముప్పే. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం అంత శ్రేయస్కరం కాదు.

వాస్తవానికి ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారంటే.. ఒకరకంగా మీరు ఆ కంపెనీ యజమానుల్లో ఒకరిగా మారుతున్నారన్నమాట! మరి ఆ సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మరి ఒక స్టాక్‌ను కొనడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన పది కీలక విషయాలను పరిశీలిద్దాం...

పెట్టుబడి కాలపరిమితి..

మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారనేది చాలా కీలకమైన అంశం. దాన్ని బట్టే ఓ కంపెనీ స్టాక్‌ను కొనాలా? లేదా? నిర్ణయించుకోవచ్చు.

* షార్ట్‌ టర్మ్‌: ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పెట్టుబడి ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఒక్క ఏడాదికి మాత్రమే స్టాక్స్‌ కొనాలనుకుంటే స్థిరమైన ‘బ్లూ చిప్‌ కంపెనీ’లపై దృష్టి పెట్టాలి. వీటిలో రిస్క్‌ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

* మిడ్‌ టర్మ్‌: ఒక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు చేసే మదుపును మధ్యకాలిక పెట్టుబడులు అంటారు. నాణ్యమైన వర్ధమాన కంపెనీల స్టాక్స్‌పై దృష్టి పెట్టాలి. అలాగే రిస్క్‌ తక్కువ ఉన్న కంపెనీలనే ఎంచుకోవాలి.

* లాంగ్‌ టర్మ్‌: ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం మీ పెట్టుబడులు కొనసాగిస్తే అవి దీర్ఘకాల పెట్టుబడుల కింద వర్గీకరించొచ్చు. ఒకవేళ మధ్యలో ఏవైనా ఒడుదొడుకులు వచ్చినా.. తిరిగి కోలుకునేందుకు సమయం ఉంటుంది. కంపెనీ పునాదులు బలంగా ఉంటే ఎలాంటి కుదుపులు వచ్చినా బయటకు రాకుండా ఉంటే మంచి ప్రతిఫలం దక్కుతుంది.

పెట్టుబడి వ్యూహం..

ఎలాంటి వ్యూహంతో స్టాక్స్‌ను కొనాలనుకుంటున్నారన్నది కీలకమైన విషయం. విజయవంతమైన మదుపర్లు మూడు రకాల పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తుంటారు.

* వాల్యూ ఇన్వెస్టింగ్‌: ఏదైనా స్టాక్ దాని వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడవుతుంటే గుర్తించి దాంట్లో మదుపు చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్‌. ఈ వ్యూహాన్ని అనుసరించాలంటే స్టాక్‌ మార్కెట్‌పై మంచి అవగాహన ఉండాలి. స్టాక్ అండర్‌వాల్యుయేషన్‌, ఓవర్‌వాల్యుయేషన్‌.. అనే రెండు అంశాలపైనే దీని అమలు ఆధారపడి ఉంటుంది.

* గ్రోత్‌ ఇన్వెస్టింగ్‌: భవిష్యత్తులో భారీ లాభాలు, ఆదాయం పొందే అవకాశం ఉన్న కంపెనీలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టే వ్యూహమే గ్రోత్‌ ఇన్వెస్టింగ్‌. సాధారణంగా ఈ వ్యూహం చిన్న కంపెనీల్లో పెట్టుబడికి అనువుగా ఉంటుంది. కొన్ని కంపెనీలు పరిశ్రమలో ఇతర సంస్థల కంటే.. మార్కెట్‌ ట్రెండ్‌ కంటే కూడా మెరుగైన రాబడి సాధిస్తుంటాయి. వాటిని మదుపర్లు గ్రోత్‌ ఇన్వెస్టింగ్‌కు పరిశీలిస్తుంటారు.

* ఇన్‌కమ్‌ ఇన్వెస్టింగ్‌: మెరుగైన డివిడెండ్లు చెల్లించే కంపెనీలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టడమే ఇన్‌కమ్‌ ఇన్వెస్టింగ్‌ కిందకు వస్తుంది. డివిడెండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి మరిన్ని స్టాక్స్‌ కొనడానికి ఉపయోగిస్తుంటారు.

కంపెనీ పునాదులు..

ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలన్నా.. ముందుగా ఆ కంపెనీ పూర్వాపరాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయాలి. గత కొన్నేళ్ల పనితీరును తెలుసుకోవాలి. ‘ప్రైస్‌ టు ఎర్నింగ్స్‌ రేషియో’ (P/E Ratio), ‘డెట్‌ టు ఈక్విటీ రేషియో’, ‘ప్రైస్‌ టు బుక్‌ వాల్యూ రేషియో’ (P/B Ratio).. వంటి కీలక ఇండికేటర్స్‌ను చెక్‌ చేసుకోవాలి.

పోటీ కంపెనీలతో పోలిస్తే..

ఒకే పరిశ్రమలో ఉండే వివిధ కంపెనీలతో పోలిస్తే.. మనం ఎంచుకున్న కంపెనీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్‌లలో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. లేదా కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లను పరిశీలించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

వాటాల తీరు..

కంపెనీలో వివిధ వర్గాల మధ్య వాటా పంపిణీ ఎలా ఉందో చూడాలి. కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, నియంత్రణాధికారాలు ఉండే వారిని ప్రమోటర్లు అంటారు. సాధారణంగా వీరికి సంస్థలో మిగిలిన వారితో పోలిస్తే అధిక వాటాలుంటాయి. కీలక పదవుల్లోనూ వీరే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రమోటర్లు, దేశీయ సంస్థాగత మదుపర్లు, విదేశీ సంస్థాగత మదుపర్లకు అధిక వాటాలున్న కంపెనీని మదుపునకు ఎంచుకోవడం ఉత్తమం.

మ్యూచువల్‌ ఫండ్ల వాటా..

తక్కువ నష్టభయం, ఎక్కువ రాబడి ఇచ్చే కంపెనీల్లోనే మ్యూచువల్‌ ఫండ్లు పెట్టుబడి పెడుతుంటాయి. వీటిని సురక్షితమైన స్టాక్స్‌గా పరిగణించొచ్చు.

కంపెనీ మార్కెట్‌ విలువ..

కంపెనీ మార్కెట్‌ విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కంపెనీ పరిమాణంపైనే నష్టభయం ఆధారపడి ఉంటుంది. ఓ సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను బట్టే మదుపు కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

డివిడెండ్‌ చెల్లింపుల తీరు..

కంపెనీ లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు ఇస్తే దాన్ని డివిడెండ్ అంటారు. గత కొన్నేళ్లలో కంపెనీ తమ షేర్‌హోల్డర్లకు ఎంత మొత్తం డివిడెండ్లను పంపిణీ చేసిందో పరిశీలించాలి. ఏటా ఆదాయం కోసం మదుపు చేసేవారు డివిడెండ్‌ అధికంగా చెల్లించే కంపెనీలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఆదాయ వృద్ధి..

ఆదాయం, లాభాలు ఏటా వృద్ధి చెందే కంపెనీల్లోనే మదుపు చేయడం ఉత్తమం. త్రైమాసిక ఫలితాలను పరిశీలించడం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.

ఊగిసలాట..

కొన్ని కంపెనీలు నిరంతరం తీవ్ర ఊగిసలాటలో పయనిస్తుంటాయి. భారీ లాభాల నుంచి ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంటాయి. కొన్ని రోజుల్లోనే కోలుకొని లాభాల్లోకి ఎగబాకుతాయి. ఇలాంటి స్టాక్స్‌ నుంచి అసరమైనప్పుడు బయటకు రావడం అంత సులభం కాదు. మనం నిష్క్రమించాలనుకున్నప్పుడు అవి నష్టాల్లో ఉంటే కష్టమే. కాబట్టి తక్కువ ఊగిసలాట ఉన్న కంపెనీలను ఎంచుకోవడం శ్రేయస్కరం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts