ఎంత బీమా..మీకు ధీమా!

జీవిత బీమా పాలసీ తీసుకోవాలని చూస్తున్నారా? ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత జీవిత బీమా తీసుకోవాలనే విషయాన్ని లెక్కించడం అంత సులభం కాదు.

Published : 07 Apr 2023 00:08 IST

జీవిత బీమా పాలసీ తీసుకోవాలని చూస్తున్నారా? ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత జీవిత బీమా తీసుకోవాలనే విషయాన్ని లెక్కించడం అంత సులభం కాదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కుటుంబ సభ్యుల భవిష్యత్‌ ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం దీన్ని కొంత మేరకు అంచనా వేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా.

ఆర్జించే వ్యక్తి ఉన్నంత కాలం కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఉండవు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఒక్కసారిగా ఆందోళన కలుగుతుంది. వ్యక్తి లేని లోటును ఎవరూ తీర్చలేరు. కానీ, ఆ వ్యక్తి ఆర్థిక బాధ్యతలను పంచుకునేందుకు బీమా పాలసీలు కొంతమేరకు తోడ్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ ప్రస్తుత జీవన శైలిని కొనసాగించడం, జీవిత భాగస్వామికి భరోసా, అప్పులు తిరిగి చెల్లించడం, పిల్లల అవసరాలు తీర్చడంలాంటివి దీనివల్ల తీరేందుకు వీలుంటుంది. జీవిత బీమా వ్యక్తి ‘ఆర్థిక విలువ’ను భర్తీ చేసేలా ఉండాలి.

పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో తక్కువ బీమా పాలసీ ఉన్నా కుటుంబానికి తగిన భద్రత లభించదు. అవసరానికి మించి ఉన్నా.. ప్రీమియం రూపంలో ఏటా అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సరైన బీమా విలువను లెక్కించేందుకు అనుసరించాల్సిన సూత్రం ఒకటుంది.
మీ వార్షికాదాయానికి 10, 15, 20 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం.. ఈ సూత్రం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది.
ఆదాయం ఎంత ఉందన్నదాని ఆధారంగా బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో కుటుంబానికి ఒక ఆధారం కల్పించినట్లు అవుతుంది. దీంతోపాటు ఒక వ్యక్తి తనకున్న అప్పులనూ లెక్కించాలి. ఉదాహరణకు రూ.40 లక్షల గృహరుణం, రూ.15 లక్షల వాహన రుణం ఉందనుకుందాం.. అప్పుడు ఒక వ్యక్తి రూ.కోటి పాలసీ తీసుకున్నా.. అప్పులు పోను నికరంగా మిగిలేది రూ.45 లక్షలే. కుటుంబ అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోకపోవచ్చు. పాలసీదారుడి వార్షికాదాయం రూ.15 లక్షలు ఉందనుకుంటే.. అతను తక్కువలో తక్కువ రూ.1.5 కోట్ల బీమా తీసుకోవాలి. దీనికి పైన చెప్పిన అప్పులు రూ.55 లక్షలను కలిపితే దాదాపు రూ.2 కోట్ల మేరకు బీమా పాలసీ తీసుకోవాలి. అప్పుడే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందన్నమాట.  జీవిత బీమా అంటే.. ఆదాయాన్ని భర్తీ చేయడం. కుటుంబం ప్రస్తుత జీవన ప్రమాణాన్ని కొనసాగించేందుకు ఎంత డబ్బు అవసరమో లెక్కించాలి. ఏటా ఆ మొత్తం వచ్చేందుకు బ్యాంకులో లేదా ఇతర పెట్టుబడి పథకాల్లో ఎంత నిధిని జమ చేయాలన్నది చూసుకోవాలి. కుటుంబానికి ఇతర ఆదాయ మార్గాలేమీ లేనప్పుడు ఈ మొత్తం కాస్త అధికంగానే ఉండేలా చూసుకోవాలి. పిల్లల చదువుల ఖర్చు పెరుగుతూ ఉంటుంది. విద్యా ద్రవ్యోల్బణాన్నీ లెక్కలోకి తీసుకోవాలి. పిల్లలున్న వారు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఖర్చు అవుతుందనే అంచనా వేసుకోవాలి. వీటన్నింటినీ గణించాకే పాలసీ విలువను నిర్ణయించుకోవాలి.

గృహ రుణం లాంటి దీర్ఘకాలిక అప్పులు చేసినప్పుడు.. దీనికి అనుబంధంగా ‘లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ’ తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోనిదేదైనా జరిగినప్పుడు ఆ రుణాన్ని బీమా కంపెనీ తీర్చేస్తుంది. ఫలితంగా కుటుంబ సభ్యులపై భారం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని