UPI: సింగపూర్‌లో ఉన్నవాళ్లకీ యూపీఐ ద్వారా నగదు బదిలీ!

సింగపూర్‌లో ఉన్నవాళ్లకీ సులువుగా నగదు బదిలీ చేసేలా తర్వలో యూపీఐ-పేనౌలను అనుసంధానించనున్నట్లు సింగపూర్‌లోని భారత్‌ హైకమిషన్‌ పి. కుమరన్‌ తెలిపారు. దీనివల్ల రెండు దేశాల ప్రజలు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా నగదు బదిలీ చేయొచ్చు. 

Updated : 23 Nov 2022 10:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ నగదు బదిలీ ప్రక్రియ వేగంగా జరిగేందుకు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)ను, సింగపూర్‌ పేనౌ (PayNow)తో  అనుసంధానించనున్నారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య నగదు బదిలీ తక్కువ ఖర్చుతో, సులువుగా జరుగుతుంది. ఇకపై రెండు దేశాల ప్రజలు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని సింగపూర్‌లోని భారత్‌ హైకమిషనర్‌ పి. కుమరన్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మానిటరీ ఆథారిటీ ఆఫ్ సింగపూర్‌లు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పంద ప్రక్రియను పూర్తిచేశాయి. మరికొద్ది నెలలో ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు కుమరన్‌ తెలిపారు. 

భారత్‌లోని కార్డ్‌ పేమెంట్ నెట్‌వర్క్ రూపే తరహాలోనే సింగపూర్‌లో పే నౌ (Pay now)నెట్‌వర్క్‌ పనిచేస్తుంది. ఇది మరికొన్ని ఆసియా దేశాల్లో కూడా తమ సేవలను అందిస్తోంది. యూపీఐ-పేనౌ అనుసంధానం తర్వాత భవిష్యత్తులో భారతీయ వినియోగదారులు పే నౌ ద్వారా  సింగపూర్‌తోపాటు ఇతర ఆసియా దేశాల్లోని తమ వారికి నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. సింగపూర్‌కు వచ్చే భారతీయ పర్యాటకుల్లో చాలా మంది వద్ద రూపే డొమెస్టిక్ కార్డులు ఉండటం వల్ల నగదు చెల్లింపుల్లో సమస్యలను ఎదురవుతున్నాయి. మరోవైపు సింగపూర్‌లో పనిచేసే భారతీయులు స్వదేశంలోని తమ వారికి నగదు బదిలీ చేసేందుకు 10 శాతం బ్యాంకులకు రుసుముగా చెల్లిస్తున్నారు.  యూపీఐ-పేనౌ అనుసంధానంతో ఈ సమస్యలకు పరిష్కారం లభించినట్లు అవుతుందని కుమరన్‌ తెలిపారు. అయితే, నగదు బదిలీలో పరిమితి ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని