ఇతర దేశాలకే ఎక్కువ టీకాలిచ్చాం

సొంత దేశంలో ఎంతమందికైతే టీకా డోసులు అందించిందో అంతకంటే ఎక్కువ డోసులు ప్రపంచదేశాలకు భారత్‌ సరఫరా చేసిందని ఐరాస సర్వప్రతినిధి సభకు మన దేశ ప్రతినిధి కె.నాగరాజు నాయుడు తెలిపారు. 2021 ఆరంభం నాటికే అనేక టీకాలు.......

Updated : 27 Mar 2021 11:39 IST

ఐరాసలో భారత ప్రతినిధి

న్యూయార్క్‌: సొంత దేశంలో ఎంతమందికైతే టీకా డోసులు అందించిందో అంతకంటే ఎక్కువ డోసులు ప్రపంచదేశాలకు భారత్‌ సరఫరా చేసిందని ఐరాస సర్వప్రతినిధి సభకు మన దేశ ప్రతినిధి కె.నాగరాజు నాయుడు తెలిపారు. 2021 ఆరంభం నాటికే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. దీంతో టీకాను రూపొందించాలన్న సవాల్‌ పరిష్కారం అయ్యిందన్నారు. కానీ, అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడం, సమానంగా పంపిణీ చేయడమే ఇప్పుడు ప్రధానంగా అధిగమించాల్సిన సమస్య అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సరైన అవగాహన లేకపోతే పేద దేశాలే అత్యధికంగా ప్రభావితమవుతాయన్నారు.

కరోనాపై పోరులో భారత్‌ ఎప్పుడూ ముందుందని నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి ఆరు నెలల కాలంలో భారత్‌లోని 30 కోట్ల మంది కరోనా యోధులకు టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ క్రమంలో 70 దేశాలకు ఇప్పటికే టీకా అందించామని తెలిపారు. దేశీయంగా తయారుచేసిన కొవాగ్జిన్‌కు ఇప్పటికే అనుమతి లభించగా.. మరో 30 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ టీకాను సైతం భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు ఐరాసకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని