Add on credit card: యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు అంటే ఏంటి?ఎవ‌రి కోసం తీసుకోవ‌చ్చు?

వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రైమరీ క్రెడిట్ కార్డుకు అదనంగా యాడ్-ఆన్ కార్డును తీసుకోవచ్చు

Updated : 18 May 2022 14:27 IST

కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక స్వేచ్చ ఇవ్వాలని భావిస్తున్నారా?  అదే స‌మ‌యంలో వారి ఖ‌ర్చుల‌ను ట్రేక్ చేయాల‌నుకుంటున్నారా? అయితే యాడ్ - ఆన్ క్రెడిట్ కార్డు తీసుకోవ‌చ్చు. ఇది మీ క్రెడిట్ కార్డుని కుటుంబ స‌భ్యుల‌తో షేర్ చేసుకోవ‌డంతో పాటు, వారి ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేసేందుకు మీకు స‌హాయ‌ప‌డ‌తుంది. అలాగే ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మీ క్రెడిట్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా త‌గ్గించుకోవ‌చ్చు. 

యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అంటే..
ఇప్పటికే ప్రైమరీ/ స్టాండర్డ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వారు అదనంగా మరో కార్డును తీసుకోవడాన్ని యాడ్-ఆన్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డ్ అంటారు. వ్యక్తిగత క్రెడిట్ కార్డులను అందిస్తున్న చాలా వరకు సంస్థలు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రైమరీ క్రెడిట్ కార్డుకు అదనంగా యాడ్-ఆన్ కార్డును తీసుకోవచ్చు.  

ఫీచర్లు..ప్రైమరీ కార్డుకు వర్తించే ఫీచర్లే యాడ్-ఆన్ కార్డుకి వర్తిస్తాయి. ప్రైమ‌రీ కార్డుపై వచ్చే అన్ని ప్రయోజనాలు సప్లిమెంటరీ కార్డుపైనా పొందవ‌చ్చు. అయితే యాడ్ - ఆన్ కార్డును ఉపయోగించేటప్పుడు కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలి. 

క్రెడిట్ లిమిట్..
ప్రైమరీ క్రెడిట్ కార్డుకు వర్తించే క్రెడిట్ లిమిట్ యాడ్ - ఆన్ కార్డుకి వర్తిస్తుంది. అయితే ప్రైమరీ కార్డు హోల్డర్లు ప్రతీ యాడ్ -  ఆన్ కార్డుకి లిమిట్ పెట్టవచ్చు. ప్రైమరీ కార్డుతో సమానంగా గానీ అంతకంటే తక్కువగానీ లిమిట్ సెట్ చేసుకోవచ్చు.

రివార్డ్ పాయింట్లు..
ప్రైమరీ కార్డు హోల్డర్ల మాదిరిగానే యాడ్- ఆన్ కార్డు హోల్డర్లు రివార్డు పాయింట్లను పొందవచ్చు. అంటే కనీస లావాదేవీల మొత్తం, వచ్చే రివార్డు పాయింట్లు, రిడీమ్‌ ఆప్షన్ అన్ని ఒకేలా ఉంటాయి. అయితే వచ్చిన రివార్డు పాయింట్లు మాత్రం ప్రైమరీ కార్డు హోల్డర్ ఖాతాకు క్రెడిట్ అవుతాయి. పాయింట్లను రీడీమ్ చేస్తున్నప్పుడు, ఏకీకృత పాయింట్లను ఉపయోగించవచ్చు.

ఎయిర్‌పోర్ట్‌ లాంజ్ యాక్సిస్..
సాధారణంగా క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు కొన్ని సంస్థలు ప్రైమరీ కార్డు హోల్డ‌ర్‌కి ఉచిత కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సిస్ అందిస్తాయి. అయితే యాడ్ - ఆన్ కార్డులకు ఈ యాక్సిస్ అనుమతించరు. ప్రత్యేకించి, ఎయిర్‌పోర్ట్‌ ప్రయారిటీ పాస్ ప్రోగ్రామ్‌లు అందించే ఉచిత సభ్యత్వం, ఇతరాలు.. ప్రైమరీ కార్డ్ హోల్డర్లకు మాత్రమే లభిస్తాయి. ఇందుకు భిన్నంగా కొన్ని కార్డులు మాత్రం కాంప్లిమెంటరీగా ఇచ్చే ఉచిత యాక్సిస్‌ల‌ను ప్రైమరీ, యాడ్ - ఆన్ కార్డు హోల్డర్లు పంచుకునేందుకు అనుమతిస్తున్నాయి. 

ఆఫర్లు..
ఆఫర్ల విషయంలో చాలా వరకు కార్డు జారీ సంస్థలు.. యాడ్ - ఆన్ కార్డుని మరొక కార్డుగా పరిగణిస్తున్నాయి. మీ కార్డు విషయంలోనూ ఇదే వర్తిస్తుంటే ప్రాథమిక , యాడ్- ఆన్ కార్డు హోల్డర్లు విడివిడిగా ఆఫర్లు పొందవచ్చు. సాధారణ క్రెడిట్ కార్డు ఆఫర్లలో తగ్గింపులు, క్యాష్ బ్యాక్‌లు, ఉచిత బహుమతులు, ఓచర్లు మొదలైనవి లభిస్తాయి. 

ఎన్ని కార్డులు తీసుకోవ‌చ్చు?
కార్డు జారీసంస్థలు ప్రాథమిక కార్డుపై 2 లేదా 3 పరిమిత సంఖ్యలో యాడ్ - ఆన్ కార్డులను జారీ చేస్తాయి. చాలా వరకు సంస్థలు వార్షిక రుసుము, జాయినింగ్ రుసుములు లేకుండా ఉచితంగానే కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే కొన్ని కార్డులు మాత్రం వార్షిక రుసుముతో వస్తాయి. అయితే ఈ ఫీజు ప్రాథమిక కార్డుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. 

యాడ్ - ఆన్ క్రెడిట్ కార్డుల‌ను ఎవ‌రి కోసం తీసుకోవ‌చ్చు?
ప్రైమ‌రీ కార్డు హోల్డ‌ర్ సొంత కుటుంబ స‌భ్యుల కోసం యాడ్ - ఆన్ కార్డు తీసుకోవ‌చ్చు. అయితే కుటుంబ స‌భ్య‌ల వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. భార్య‌, పిల్ల‌లు, తోబుట్టువులు, త‌ల్లిదండ్రులు, అత్త‌మామ‌లు వంటి వారి కోసం తీసుకోవ‌చ్చు. ఇది పూర్తిగా మీరు ఎంచుకున్న సంస్థ నియ‌మ నిబంధ‌న‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 

చివ‌రిగా..
యాడ్ - ఆన్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు బాధ్య‌త‌ ప్రైమ‌రీ కార్డు హోల్డ‌ర్‌పైనే ఉంటుంది. ఒక‌వేళ యాడ్ - ఆన్ క్రెడిట్ కార్డు హోల్డ‌ర్ బిల్లు చెల్లించ‌క‌పోతే అది ప్రైమ‌రీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో క‌నిపిస్తుంది. దీని ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపైనా ఉంటుంది. అందువ‌ల్ల బిల్లు చెల్లింపుల విష‌యంలో అల‌ర్ట్‌గా ఉండ‌డం అవ‌స‌రం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని