మ‌ర‌ణించిన వారి బ్యాంకు ఖాతా నుంచి విత్‌ డ్రా ఎలా?

కుటుంబ సభ్యుడి ఆక‌స్మిక మ‌ర‌ణాన్ని ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం. ఇత‌ర స‌భ్యులు మాన‌సికంగా కుంగిపోతారు. అదే వ్య‌క్తి కుటుంబానికి ఆధార‌మైతే ఆర్థికంగానూ క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. సంపాదించే వ్య‌క్తి తన కుటుంబ స‌భ్యుల‌త....

Updated : 12 Jun 2021 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబ సభ్యుడి ఆక‌స్మిక మ‌ర‌ణాన్ని ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం. ఇత‌ర స‌భ్యులు మాన‌సికంగా కుంగిపోతారు. అదే వ్య‌క్తి కుటుంబానికి ఆధార‌మైతే ఆర్థికంగానూ క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. సంపాదించే వ్య‌క్తి తన కుటుంబ స‌భ్యుల‌తో పొదుపు, పెట్టుబ‌డులు త‌దిత‌ర విష‌యాల గురించి స‌మాచారం ఇవ్వ‌క‌పోతే మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. ఏదేమైనా కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి త‌న పొదుపు, పెట్టుబ‌డులు ఇత‌ర ఆర్థిక అంశాల గురించి ప్రాథ‌మిక స‌మాచారాన్ని కుటుంబ స‌భ్యుల‌తో పంచుకోవ‌డం మంచిదని చెబుతారు ఆర్థిక నిపుణులు.

ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకు ఖాతాను తీసుకుంటే.. మ‌ర‌ణించిన వ్య‌క్తికి బ్యాంక్ ఖాతా ఉంటే ఆ విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు తెలిస్తే, బ్యాంకు నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌డం సుల‌భం అవుతుంది. పిన్ నెంబ‌రు తెలిస్తే, ఏటీఎం ద్వారా ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ తెలియ‌క‌పోయినా బ్యాంకును సంప్ర‌దించి, కొన్ని ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం ద్వారా ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.  ఇందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చు.

నామినీని ఏర్పాటు చేసి ఉంటే..
ఒక‌వేళ ఖాతాదారుడు, నామినీని ఏర్పాటు చేసి ఉంటే ఖాతాలో ఉన్న మొత్తాన్ని బ్యాంక్‌ నామినీకి చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, నామినీ ఆ ఖాతాకు ధ‌ర్మ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. వ్య‌క్తిగ‌త ఖాతాకు సంబంధించి ఖాతాదారుడు మ‌ర‌ణించిన త‌రువాత ఆ ఖాతాలోని నిధుల‌ను నామినీ యాక్సిస్ చేయ‌వ‌చ్చు. ఒక‌వేళ నామినీ ఏర్పాటు చేయ‌క‌పోతే, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులుకు అంద‌జేస్తారు. 

సింగిల్ ఖాతా..
వ్య‌క్తిగ‌త ఖాతా విష‌యంలో మ‌ర‌ణించిన వ్య‌క్తి విల్ ఏర్పాటు చేసి ఉంటే దాని ప్ర‌కారం, హ‌క్కుదారులు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ లేక‌పోతే ఇండెమ్నిటి-క‌మ్‌-అఫిడెవిట్ బేసిస్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుల‌కు ఆస్తుల‌ను బ్యాంక్‌ అప్ప‌గిస్తుంది. క్లెయిమ్ చేసే వారిపై ఎలాంటి సందేహాలు, గొడ‌వ‌లు, స‌మ‌స్య‌లు లేక‌పోతే, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సులంద‌రూ క‌లిసి ఉమ్మ‌డిగా ఇండెమ్నిటి స‌మ‌ర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు.

జాయింట్ ఖాతాల విష‌యంలో .. 
ఒక ఖాతాదారుడు మ‌ర‌ణించినా.. జీవించి ఉన్న వ్య‌క్తి ఖాతాలోని డ‌బ్బును తీసుకోవ‌చ్చు. ఖాతాను నిర్వ‌హించేదుకు రెండో వ్యక్తికి పూర్తి అధికారం ఉంటుంది. తాము లేనన‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్త‌కుండా వ్య‌క్తిగ‌త ఖాతాను తెరిచి నామినీని త‌ప్ప‌నిస‌రిగా నియ‌మించాలి.  మ‌ర‌ణం త‌రువాత సంపూర్ణ య‌జమాని కావాల‌నుకునేవారు ఆ వ్య‌క్తితో క‌లిసి జాయింట్ ఖాతాను తెర‌వొచ్చు.

ప్రాసెస్‌..
ఖాతాదారుని మ‌ర‌ణానంత‌రం ఖాతాలోని మొత్తాన్ని తీసుకునేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా మ‌ర‌ణించిన వ్య‌క్తి డెత్ స‌ర్టిఫికేట్‌ (మ‌ర‌ణ ధ్రువీకరణ పత్రం)ను తీసుకోవాలి. దీంతో పాటు అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాలు.. నామినీ ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ వంటివి బ్యాంకుకు ఇవ్వాలి. నామినీ ట్రస్టీగా మాత్ర‌మే వ్య‌హ‌రించాలి. ఖాతాదారుడు విల్లు రాసి ఉంటే దాని ప్ర‌కారం హ‌క్కుదారుల‌కు ఆ మొత్తాన్ని అందించాలి. నామినీ కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుడైతే, విల్లులో ప్ర‌స్తావించిన విధంగా ఇత‌ర చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌తో పాటు నామినీ కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. విల్లు లేక‌పోయినా ఆ మొత్తాన్ని చ‌ట్ట‌బ‌ద్ధమైన హ‌క్కుదారుల‌కు అంద‌జేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని