MF vs Real Estate: మ్యూచువల్‌ ఫండ్లు, రియల్‌ ఎస్టేట్‌లో ఏది మంచి పెట్టుబడి?

మ్యూచువల్‌ ఫండ్లు, రియల్‌ ఎస్టేట్‌లలో ఏ పెట్టుబడి సరైందో ఇక్కడ తెలుసుకోండి.

Updated : 25 Aug 2023 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం పెట్టుబడిదారులకు మదుపు చేయడానికి మార్కెట్లలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఎన్ని పెట్టుబడి ఎంపికలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్‌లో జోరు మీద ఉన్నవి మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) అని చెప్పొచ్చు. ఈ రెండూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి ఎంపికలు. వీటిలో దేనిలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకోవచ్చు? లాభ నష్టాలు ఏంటి? అనేది ముందుగా తెలుసుకోవాలి.

మ్యూచువల్‌ ఫండ్లు

మ్యూచువల్‌ ఫండ్లు.. షేర్లు, బాండ్లు వంటి వివిధ రకాల సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల నుంచి డబ్బును సమకూర్చుకుంటాయి. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం అనేది సులభమైన ప్రక్రియ. పెట్టుబడి ప్రారంభించడానికి కొన్ని నిమిషాలు చాలు. మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహించే ఫండ్‌ మేనేజర్‌లు వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్‌ ఫండ్లు సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నియంత్రణలో ఉంటాయి. ఈ పెట్టుబడులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించవచ్చు, ఫండ్ల పనితీరును ట్రాక్‌ చేయొచ్చు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు స్వల్పకాలంలో అధిక ఒత్తిడికి గురవుతాయి.

రియల్‌ ఎస్టేట్‌

భారత్‌ వంటి దేశంలో రియల్‌ ఎస్టేట్‌ చాలా సందర్భాల్లో ఇష్టపడే పెట్టుబడి ఎంపిక. పెట్టుబడిదారులు నివాస, వాణిజ్య ఆస్తులలో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT)లలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ భౌతిక ఆస్తి. ఇది భద్రతా భావాన్ని అందిస్తుంది. వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఆస్తి విలువ, అద్దె కూడా పెరుగుతాయి.

ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహాలు తీసుకోవలసి రావచ్చు. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మొదలైన వాటిని భరించాలి. ఇది పెట్టుబడిదారులకు చాలా ఖర్చు, శ్రమ, సమయంతో కూడుకున్న ప్రక్రియ. ఆస్తి ఉండే ప్రాంతాన్ని బట్టి అభివృద్ధిలో మార్పులుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ గణనీయమైన పెట్టుబడితో పాటు నిరంతర నిర్వహణ, మరమ్మతు ఖర్చులను కలిగి ఉంటుంది. ఆర్థిక మందగమనం సమయంలో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు చాలా ప్రమాదం. ప్రాపర్టీ ధరలు గణనీయంగా పడిపోయే అవకాశాలెక్కువ.

రిటర్న్స్‌

మనం ఏదైనా ఒక పెట్టుబడి గురించి మాట్లాడుకున్నప్పుడు దాని రాబడిని ముందుగా పరిగణనలోకి తీసుకోవాలి. గత పదేళ్లలో భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ సగటు రాబడి 5-8% అని ఒక రిపోర్ట్ చెబుతోంది. మరోవైపు గత దశాబ్దంలో మ్యూచువల్‌ ఫండ్‌ రాబడిని పరిశీలిస్తే.. సగటు రాబడి 10-12% మధ్య ఉంది. ద్రవ్యోల్బణాన్ని మించే రాబడి కావాలనుకునే పెట్టుబడిదారులకు మ్యూచువల్‌ ఫండ్లు మంచి ఎంపిక అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

లిక్విడిటీ

మనకు ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు. కానీ, వాటిని అవసరమైన సమయంలో ఉపయోగించలేకపోతే అవన్నీ నిరుపయోగంతో సమానమే. ఈ కోణంలో ఆలోచిస్తే మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు చాలా లిక్విడిటీని కలిగి ఉంటాయి. యూనిట్‌లను కొన్ని బటన్‌లను క్లిక్‌ చేయడం ద్వారా ఎప్పుడైనా రిడీమ్‌ (ఉపసంహరణ) చేసుకోవచ్చు. ఈ డబ్బు 2-3 పనిదినాల్లోగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే, రియల్‌ ఎస్టేట్‌ అమ్మకం అనేది ఇంత సులభంగా ఉండదు. సరైన కొనుగోలుదారుని కనుగొనడానికి నెలలు పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఇంటిని అమ్ముకోవాలనుకుంటే, మనకు కావల్సిన ధర లభించదు. అమ్మకం ధర వద్ద రాజీ పడాలి. అంతేకాకుండా..అవసరం చిన్నదైనా, పెద్దదైనా పూర్తి ఆస్తిని అమ్మాలి. ఆస్తిపై చిన్న వివాదమున్నా సరే దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఆస్తిని అమ్మేటప్పుడు మీడియాలో ప్రకటనలకు, ఏజంట్లకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆస్తులను అమ్మేటప్పుడు చాలా సమయం కేటాయించవలసి ఉంటుంది.

పెట్టుబడి

మ్యూచువల్‌ ఫండ్లలో రూ.500 (సిప్‌)తో కూడా పెట్టుబడిని ప్రారంభించొచ్చు. ఇంత తక్కువ పెట్టుబడితో ఏ ఇతర విలువైన ఆస్తులనూ కొనుగోలు చేయలేం. అదే రియల్‌ ఎస్టేట్‌లో అయితే, హైదరాబాద్‌ లాంటి నగరంలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ కొనడానికి కనీసం రూ.70-75 లక్షల పెట్టుబడి పెట్టాలి. దాని కోసం ఇంటి రుణాన్ని పొందాలనుకున్నా, మీరు సొంతంగా 15-20% (రూ.12-15 లక్షలు) డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. అలాగే, ప్రాంతాన్ని బట్టి రిజిస్ట్రేషన్‌ ఫీజూ చెల్లించాలి. అందుచేత రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులనేవి ఆర్థికంగా చాలా భారంగా ఉంటాయి.

పన్నులు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో యూనిట్లు కొనుగోలు చేసిన ఒక ఏడాది తర్వాత విక్రయించినట్లైతే (రూ.1 లక్ష కంటే ఎక్కువ లాభంపై) 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) చెల్లించాలి. 1 ఏడాది లోపు విక్రయిస్తే 15 శాతం పన్ను చెల్లించాలి. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి కూడా కొన్ని పన్ను ప్రయోజనాలతో వస్తుంది. మీరు ఇంటి రుణాన్ని పొందినట్లయితే అసలు, వడ్డీ మొత్తంపై వివిధ కేటగిరీల కింద రూ.2- 3.50 లక్షల మధ్య పన్ను మినహాయింపును పొందొచ్చు. అలాగే, ఆస్తిని కొనుగోలు చేసిన 2 ఏళ్ల తర్వాత విక్రయించినప్పుడు 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) చెల్లించాలి. అయితే, పొందిన మూలధన లాభాన్ని మరో ఆస్తిలో లేక క్యాపిటల్ గేన్ బాండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మినహాయింపులు కూడా పొందొచ్చు.

చివరిగా: ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి మొత్తం, రిస్క్ సామర్థ్యం లాంటి వాటి ఆధారంగా పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవడం మేలు. ఆర్థిక అవగాహన లేని వారు మంచి ఆర్థిక సలహాదారుని సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని