Ajay Banga: అజయ్‌ బంగాకు కరోనా.. మోదీతో భేటీ రద్దు

Ajay Banga: రోజువారీ పరీక్షల్లో భాగంగా అజయ్‌ బంగా (Ajay Banga)కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటించింది.

Published : 24 Mar 2023 12:00 IST

దిల్లీ: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అమెరికా నామినేట్‌ చేసిన భారత సంతతి వ్యక్తి అజయ్‌ బంగా (Ajay Banga)కు కరోనా సోకింది. దీంతో రెండు రోజుల భారత పర్యటనలో ఆయన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో భేటీ కావాల్సి ఉంది. కొవిడ్‌ కారణంగా ఇప్పుడు అవన్నీ రద్దు కానున్నాయి.

రోజువారీ పరీక్షల్లో భాగంగా అజయ్‌ బంగా (Ajay Banga)కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొంది. కానీ, నిబంధనల్లో భాగంగా ఒక్కరే క్వారంటైన్‌కు వెళ్లారని తెలిపింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడం కోసం బంగా గత మూడు వారాలుగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మార్చి 23, 24 తేదీల్లో భారత్‌లో పర్యటించాల్సి ఉంది.
(ఇదీ చదవండి: అజయ్‌ బంగా.. మన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థే)

ఈ రెండు రోజుల పర్యటనలో భారత అభివృద్ధి, ప్రపంచ బ్యాంకు పాత్ర, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సవాళ్ల వంటి అంశాలపై బంగా (Ajay Banga) ఇక్కడి నాయకులతో చర్చిస్తారని యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గతంలో ప్రకటించింది. బంగాను నామినేట్‌ చేయగానే భారత్‌ ఆయనకు మద్దతు ప్రకటించింది. అదే బాటలో జపాన్‌, కొలంబియా, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, కెన్యా, సౌదీ అరేబియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, యూకే సహా మరికొన్ని దేశాలూ బంగా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి.
(ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడి ఎన్నికకు ఇదీ తంతు!)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని