
Uttar Pradesh: ప్రాక్టికల్స్ పేరిట పిలిపించి.. 17 మంది బాలికలపై వేధింపులు!
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపలే.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలపై ప్రిన్సిపల్‌తోపాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రాక్టికల్స్ పేరిట తమను స్కూల్‌కి రప్పించి.. ఆహారంలో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోయాక.. ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాలికలు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు వాపోయారు.
‘ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ప్రాక్టికల్ పరీక్షల సాకుతో 17 మంది విద్యార్థినులను స్కూల్‌కు రప్పించాడు. మరుసటి రోజు మరిన్ని ప్రాక్టికల్స్ ఉంటాయని చెప్పి, ఆ రోజు రాత్రి అక్కడే ఉండాలని సూచించాడు. అనంతరం భోజనం సిద్ధం చేసి, వారికి వడ్డించాడు. అది తిన్న బాలికలు స్పృహ కోల్పోయారు. ఆపై వేధింపులకు పాల్పడ్డాడు’ అని ఓ ఫిర్యాదుదారుడు తెలిపారు. తరగతిలో 29 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం బాలికలను మాత్రమే పిలిచినట్లు మరో వ్యక్తి ఆరోపించారు.
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా, ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్లు ముజఫర్‌నగర్ ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అయిదు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.