దేవికారాణికి చెందిన రూ.1.99కోట్లు స్వాధీనం

మా వైద్యసేవల కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికారాణికి చెందిన మరో రూ.1.99 కోట్లను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ తమిళనాడులోని ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, ఆమె కుటుంబసభ్యుల పేర్ల మీద..

Updated : 17 Dec 2020 04:40 IST

హైదరాబాద్‌: బీమా వైద్యసేవల కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికారాణికి చెందిన మరో రూ.1.99 కోట్లను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, తమిళనాడులోని ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, ఆమె కుటుంబసభ్యుల పేర్ల మీద చిట్టీల రూపంలో డబ్బు దాచుకున్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి డీడీల రూపంలో రూ.1.99కోట్లు స్వాధీనం చేసుకుని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో జమ చేశారు. స్థిరాస్తి వ్యాపారంలోనూ దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ ఇదివరకే గుర్తించింది. కొన్ని నెలల క్రితం దేవికారాణికి చెందిన రూ.6.76 కోట్ల డీడీలను స్థిరాస్తి సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. వాటిని కూడా న్యాయస్థానంలో జమ చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో దేవికా రాణితో పాటు మరికొంత మంది అధికారులు, మెడికల్ ఏజెంట్లు కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అవసరం లేకున్నా మందులు అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వేయి కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని