తుప్పల్లో శవమై తేలిన కరోనా రోగి

ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు..

Published : 28 Jul 2020 01:30 IST

ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని రోగి బంధువుల ఆరోపణ

ప్రయాగ్‌రాజ్‌: ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ఆసుపత్రికి 500 మీటర్ల సమీపంలోని పొదల్లో అతడి మృతదేహం లభ్యమైంది. రోగి ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్‌రాణి నెహ్రూ (ఎస్‌ఆర్‌ఎన్‌) ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం సదరు రోగిని చేర్పించారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడు ఆసుపత్రి వార్డు గేటు నుంచి బయటకు రావడం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యింది. 

ఆసుపత్రి సిబ్బంది వేధింపుల వల్లనే పారిపోయాడని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మృతుడు వారి బంధువులతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. ‘రాత్రి నుంచి నోరంతా ఎండిపోతోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు’ అని బాధితుడు అందులో పేర్కొన్నాడు. ఆ ఆడియో క్లిప్‌ నిన్న బయటకు వచ్చింది. కాగా మృతుడి బంధువుల ఆరోపణలను ఆసుపత్రి వర్గం ఖండించింది. ‘సదరు రోగి జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స అందిస్తుండటంతో అతడి ఆరోగ్యం కుదుటపడుతోంది. కానీ అతడు ఎందుకు పారిపోయాడో తెలియడం లేదు. అతడిని ఆపేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే వెళ్లిపోయాడు. సిబ్బంది అతడిని వెంబడించినా లాభం లేకుండా పోయింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాం’ అని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రి ప్రిన్సిపల్‌ డా.ఎస్‌పీ సింగ్‌ వెల్లడించారు. 

పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య కార్యకర్తలు ఆదివారం సాయంత్రం పొదల్లో నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ ప్రాంతం ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలోనే ఉంది. ‘మా తండ్రి ఇక లేరు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే మా నాన్న చనిపోయారు. ఆసుపత్రిలోని రోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు’ అని మృతుడి కుమార్తె ఆరోపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని