
కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై గస్తీ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై గురువారం కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘శ్రీనగర్ సమీపంలోని హెచ్ఎంటీ ప్రాంతంలో జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ముగ్గురిలో ఇద్దరు పాక్కు చెందిన వారు, ఒకరు స్థానికుడిగా అనుమానిస్తున్నారు. సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసు బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది’ అని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు రెండు రోజులు ఉన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఇప్పటికే నవంబర్ 19న ఎన్నికలకు అంతరాయం కలిగించాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే నగ్రోటా వద్ద భారీగా ఆయుధాలతో ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.