10 కి.మీ నడిచి మరీ తండ్రిపై ఫిర్యాదు చేసింది

ఆరో తరగతి చదివే చిన్నారి.. పది కిలోమీటర్లు నడిచి మరీ తండ్రిపై ఫిర్యాదు చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Published : 18 Nov 2020 00:07 IST

కేంద్రపరా: ఆరో తరగతి చదివే చిన్నారి.. పది కిలోమీటర్లు నడిచి మరీ తండ్రిపై ఫిర్యాదు చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. తన హక్కుల పై అవగాహన ఉన్న ఈ బాలిక.. తనకు మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్న డబ్బును తన తండ్రి కాజేస్తున్నాడని కేంద్రపడా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. కార్యాలయాన్ని చేరేందుకు గాను కాలినడకన పది కిలోమీటర్లు ప్రయాణించింది.

కొవిడ్-19 లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం ప్రతి పాఠశాల విద్యార్థి ఖాతాలో రోజుకు రూ.8 చొప్పున అందచేస్తోంది. విద్యార్థికి బ్యాంకు ఖాతా లేనపుడు ఈ మొత్తం తల్లితండ్రులు లేదా సంరక్షకుల ఖాతాలో జమ అవుతుంది. అంతేకాకుండా రోజుకు 150 గ్రాముల బియ్యం కూడా ప్రతి విద్యార్థికీ లభిస్తుంది. కాగా, ఈ బాలిక తల్లి రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. తండ్రి మరో వివాహం చేసుకుని, బాలికను బయటకు నెట్టేయటంతో ఆ చిన్నారి తన మేనమామ వద్ద ఉంటోంది. 

తనను ఇంట్లో ఉండనివ్వకపోయినా.. తన తండ్రే ప్రభుత్వ ప్రయోజనాలను స్వాహా చేస్తున్నాడని బాలిక ఆరోపించింది. తనకు బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ.. అతను పాఠశాలకు వెళ్లి మరీ ప్రభుత్వం అందించే ప్రయోజనాలను తీసుకుంటున్నాడని వివరించింది. ఈ మేరకు బాలిక నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్‌ సమర్థ్‌ వర్మ.. ఆ మొత్తాన్ని చిన్నారి బ్యాంకు ఖాతాకే అందేలాగా చూడాలని ఆదేశించారు. అంతే కాకుండా ఈ పథకం బియ్యాన్ని కూడా చిన్నారికే అందచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని