బిడ్డను కాల్వలో విసిరి.. మహిళపై దారుణం

దళిత మహళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఐదేళ్ల ఆమె బిడ్డను కాలువలో విసిరేయటంతో చిన్నారి మరణించినట్టు తెలిసింది.

Published : 12 Oct 2020 19:56 IST

బక్సర్‌: హాథ్రస్‌ తరహా ఘటనల పరంపర దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మూడురోజుల వ్యవధిలో బిహార్‌లో మరో మహిళపై దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్‌ బాలికపై ఆటో డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కనుమరుగు కాకముందే.. మరో దళిత మహళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండే ఐదేళ్ల ఆమె బిడ్డను కాలువలో విసిరేయటంతో చిన్నారి మరణించినట్టు తెలిసింది. ఘటనా సమయంలో వీరందరూ మద్యం సేవించి ఉన్నట్టు భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని పట్నాకు 135 కి.మీ దూరంలోని బక్సర్‌ జిల్లా, మురార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

35 ఏళ్ల బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తన కుమార్తె, మనుమడు బ్యాంకుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న కాలువ వద్ద ఇద్దరు వ్యక్తులు వారిని అటకాయించారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆమెను బలవంతంగా  లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం.. చిన్నారి ప్రాణాలు తీసినట్టు ఆయన చెప్పారు. చిన్నారి ఏడుపుతో సమీప గ్రామస్తులు వస్తారనే భయంతో నిందితులు చిన్నారి పీక నులిమి.. కాళ్లు, చేతులు కట్టి కాలువలో విసిరినట్టు తెలిసింది.
చిన్నారి మృతదేహం కాలువలో లభించగా,  అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ చిన్నారి నీటిలో మునిగి పోవటం వల్ల మరణించిందని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో ఆమెను పట్నాలోని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన  నిందితులుగా భావిస్తున్న ఏడుగురిలో ఇద్దరిని గుర్తించామని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని.. ఘటనపై విచారణ చేపట్టామని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని