Car Chasing: మధ్యప్రదేశ్‌లో భారీ ఛేజ్‌.. కారులో 40 పిస్తోళ్లు స్వాధీనం!

అక్రమంగా ఆయుధాలు తరలిస్తోన్న ఓ అంతర్రాష్ట్ర ముఠా కారును పోలీసులు భారీ ఛేజ్‌ చేసి పట్టుకున్నారు. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకు నిందితులు కారు వదిలిపెట్టి.. అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 02 Nov 2022 01:25 IST

భోపాల్‌: అక్రమంగా ఆయుధాలు తరలిస్తోన్న ఓ అంతర్రాష్ట్ర ముఠా కారును పోలీసులు ఛేజ్‌(Car Chasing) చేసి పట్టుకున్నారు. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకు నిందితులు కారు వదిలిపెట్టి.. అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కారులో 40 పిస్తోళ్లు, 36 మ్యాగజీన్లు, ఇతర ఆయుధ సామగ్రి లభ్యమైనట్లు చెప్పారు. ఆయుధాల తరలింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. తొలుత ఇండోర్‌లోని రౌ ప్రాంతంలో కారును అడ్డుకునేందుకు యత్నించారు. ఇది పసిగట్టిన నిందితులు కారు వేగాన్ని పెంచి, పోలీసు వాహనాన్ని ఢీకొట్టి, తప్పించుకు పారిపోయారు. ఇండోర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖల్‌ఘాట్‌ వద్ద మరో పోలీసు వాహనాన్ని, బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లారు.

పోలీసులు సైతం దీటుగా వెంబడించడంతో.. ఖర్‌గోన్‌ జిల్లాలోని సనావాడ్‌ ప్రాంతంలో వాహనాన్ని వదిలిపెట్టి, అందులోని నలుగురు నిందితులు పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయారు. హరియాణా రిజిస్టర్డ్‌ నంబర్‌ కలిగి ఉన్న ఆ కారులోంచి 40 పిస్తోళ్లు, 36 మ్యాగజీన్లు, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఇవి విదేశీ ఆయుధాల అధునాతన అనుకరణలు. స్వాధీనం చేసుకున్న మ్యాగజీన్‌లలో 30 కాట్రిడ్జ్‌లు నింపొచ్చు. సాధారణ మ్యాగజీన్‌లో 10 మాత్రమే ఉంటాయి’ అని వివరించారు. నిందితుల వేట ప్రారంభించామని, వారు ఆయుధాలను ఎక్కడనుంచి తీసుకొచ్చారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని