
Bihar: ఏఎస్‌ఐని తాళ్లతో కట్టేసి.. చితకబాది!
పాట్నా: ఓ ఏఎస్‌ఐపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి చితకబాదారు. బిహార్‌లో దీపావళి నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధరమ్‌పుర్ గ్రామంలో గొడవ జరుగుతోందని దీపావళి రోజు సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్‌ఐ సీతారాం దాస్ హుటాహుటిన అక్కడకు బయల్దేరి వెళ్లారు.
అయితే ఏఎస్‌ఐ అక్కడికి వెళ్లడంతో యువత మరింత రెచ్చిపోయారు. దీపావళి పండగ నాడు పోలీసులు పెట్రోలింగ్ ఎలా చేస్తారంటూ.. దుర్భాలాడుతూ ఏఎస్‌ఐపై దాడికి దిగారు. చేతులను తాడుతో వెనక్కి కట్టేసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. తర్వాత వదిలేయడంతో ఆయన పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పలువురు యువకులపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.