Crime News: 30 మంది మైనర్లను బలిగొన్న మానవమృగానికి.. జీవిత ఖైదు

Crime News: చిన్నారులనే కనికరం లేకుండా 30 మంది ఆడపిల్లల్ని హింసించి(Sexual assault), హతమార్చిన కేసులో రవీంద్ర కుమార్‌ అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 

Published : 25 May 2023 14:01 IST

దిల్లీ: అభం శుభం తెలియని పసిపిల్లల్ని కిడ్నాప్‌ చేసి, లైంగికదాడి (Sexual assault)కి పాల్పడి ప్రాణాలు తీసిన మానవ మృగానికి గురువారం కోర్టు శిక్ష విధించింది. దోషి రవీంద్రకుమార్‌(Ravindra Kumar)కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీలోని రోహిణి కోర్టు(Rohini Court) తీర్పునిచ్చింది. ఆరేళ్ల చిన్నారిని దారుణంగా హింసించి, హతమార్చిన కేసులో మే 9నే కోర్టు అతడిని దోషిగా తేల్చగా.. తాజాగా శిక్ష ఖరారు చేసింది.

ఇంతకీ కేసు ఏంటంటే..?

రవీంద్రకుమార్‌ 18 ఏళ్ల వయసులో ఉండగా, 2008లో అతడి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దిల్లీకి వలస వచ్చింది. తండ్రి ప్లంబర్‌. తల్లి ఇళ్లలో పనిచేసేది. దిల్లీ(Delhi) వచ్చిన కొద్దిరోజులకు రవీంద్ర డ్రగ్స్‌కు, అశ్లీల దృశ్యాలకు బానిసయ్యాడు. రోజంతా కూలీగా పనిచేసి, రాత్రిపూట డ్రగ్స్‌ తీసుకునేవాడు. అర్ధరాత్రి నిద్ర లేచి చిన్నపిల్లలను వెదుక్కొంటూ దగ్గర్లోని నిర్మాణ ప్రదేశాలు, మురికివాడలకు వెళ్లేవాడు. దొరికిన పిల్లలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగికంగా హింసించాక  హతమార్చేవాడు. ఇలా 2008 నుంచి 2015 మధ్య 30 మంది ఉసురు తీశాడు. మృతులంతా 6-12 ఏళ్ల వయసువారే. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వేర్వేరు ప్రదేశాలను ఈ ఘోరాలకు ఎంచుకునేవాడు.

అలా 2014లో ఆరేళ్ల పాపను చంపి, సెప్టిక్‌ ట్యాంకులో విసిరేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2015లో దిల్లీలోని సుఖ్‌బీర్‌నగర్‌ ప్రాంతంలో రవీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. తాజాగా జీవిత ఖైదు విధించింది. అయితే దాదాపు 30 మంది చిన్నారులపై అకృత్యాలు, హత్యలకు పాల్పడినట్లు రవీంద్రపై అభియోగాలుండగా.. ప్రస్తుతానికి మూడు కేసుల్లో మాత్రమే విచారణ జరిగింది. మిగతావాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని