దౌత్యవేత్తల పేరుతో రూ.25 కోట్లకు సున్నం!

దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని  విలాసవంతమైన కార్లపై పన్నులు ఎగ్గొడుతున్న ఓ రాకెట్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు  ఛేదించారు.

Published : 18 Jul 2021 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని విలాసవంతమైన కార్లపై పన్నులు ఎగ్గొడుతున్న ఓ రాకెట్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో గురుగ్రామ్‌కు చెందిన ‘బిగ్‌బాయ్‌ టాయ్స్’ సంస్థ సీఈవో నిపున్‌ మిగ్లానీ, దుబాయ్‌కు చెందిన లిఖాయత్‌ బఛూ ఖాన్‌, బెంగళూరులోని ఫైనాన్షియర్‌ సూర్య అర్జున్‌ ఉన్నారు. వీరు ఇప్పటి వరకూ దౌత్యవేత్తల పేరుతో కార్లు దిగుమతి చేసుకొని రూ.25 కోట్ల మేరకు కస్టమ్స్‌ సుంకం ఎగ్గొట్టినట్లు తేల్చారు.  

ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే బిగ్‌బాయ్‌ టాయ్స్ సంస్థ సీఈవో నిపున్‌ మిగ్లానీను తొలగించినట్లు ప్రకటించింది. దీంతోపాటు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. ‘‘బిగ్‌బాయ్‌ టాయ్స్ నుంచి నిపున్‌ మిగ్లానీను తక్షణమే తొలగించాము. ఆయన వ్యక్తిగత స్థాయిలో చేసిన పనులకు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. భవిష్యత్తులో కూడా ఆయనతో చేసే డీల్స్‌తో సంస్థకు సంబంధం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరూ బిగ్‌బాయ్‌ టాయ్స్‌కు ఫిర్యాదులు చేయవద్దు’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ కుంభకోణంలో గత ఐదేళ్లలో మొత్తం 20 కార్లను ఎటువంటి పన్నులు చెల్లించకుండా దిగుమతి చేసుకొన్నట్లు డీఆర్‌ఐ పేర్కొంది. వీటిల్లో రేంజి రోవర్‌, ల్యాండ్‌ క్రూజర్‌ ప్రాడో వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. వీటిని దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసుకొని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఈ కేసులో దుబాయ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా  ఉన్నాడని.. అతన్ని అరెస్టు చేయాల్సి ఉందని డీఆర్‌ఐ వెల్లడించింది.

ఆఫ్రికా ఖండంలోని ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త పేరుతో ఈ కార్లను దిగుమతి చేసుకొన్నట్లు అధికారులు తొలుత గుర్తించారు. ఆ తర్వాత ‘మాంటే కార్లో’ పేరుతో ఆపరేషన్‌ చేపట్టారు. దీనిలో భాగంగా దేశంలోని 7 నగరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆరు కార్లను రికవరీ చేశారు. ఈ వాహనాలను జపాన్‌, యుకే, యూఏఈ దేశాల్లో కొనుగోలు చేసి దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసుకొన్నట్లు గుర్తించారు. ఈ వాహనాలు దేశంలోకి రాగానే కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తి వద్దకు గానీ, విలాసవంతమైన కార్ల విక్రేత వద్దకు గానీ చేరుతున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లలోని నిర్ణీత ఆర్టీవోలు వీటికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై చెల్లించాల్సిన 204శాతం కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు పొందుతున్నారు. ఇలాంటి ఘటనలపై మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని