
Crime news: కూతురిపై అత్యాచారం.. కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి!
గోరఖ్‌పుర్: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని.. బీఎస్ఎఫ్ మాజీ జవాను (52) కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినందుకే సదరు వ్యక్తిని హత్యచేసినట్లు తెలుస్తోంది. అనంతరం స్థానికులు మాజీ జవానును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది. మృతిచెందిన వ్యక్తి బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్ హుస్సేన్ (25) అని పోలీసులు వెల్లడించారు.
2020 ఫిబ్రవరి 12న దిల్షాద్ హుస్సేన్.. బీఎస్ఎఫ్ మాజీ జవాను భగవత్ నిషాద్ కుమార్తె(16)ను కిడ్నాప్ చేశాడు. తన కుమార్తె కనిపించడం లేదంటూ భగవత్ అదే నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బాలికను హైదరాబాద్ తీసుకొచ్చిన దిల్షాద్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చిలో బాలికను కాపాడిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ కేసు విచారణ నిమిత్తమే కోర్టుకు హాజరయ్యేందుకు దిల్షాద్ శుక్రవారం గోరఖ్‌పుర్ కోర్టు గేటు వద్దకు చేరుకున్నాడు. తన లాయర్ కోసం అక్కడే ఎదురుచూస్తున్నాడు. అయితే అప్పటికే కోర్టు వద్ద వేచిచూస్తున్న భగవత్ నిషాద్.. తన వద్ద ఉన్న తుపాకీతో దిల్షాద్‌ను కాల్పి చంపాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు భగవత్‌ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులను సమాచారం ఇవ్వగా వారు వచ్చి భగవత్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.