వలస కూలీలపై అమానుషం

దేశమంతా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని బెరెల్లీ జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై..

Published : 31 Mar 2020 01:40 IST

బరేలి (ఉత్తరప్రదేశ్): దేశమంతా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై అధికారులు రోడ్డుపై కెమికల్స్‌ స్ప్రే చేశారు. దీనిలో పిల్లలు కూడా ఉన్నారు. ఇది చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ప్రముఖలు ఈ చర్యను తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దీనిపై  జిల్లా మెజిస్ట్రేట్ స్పందించారు. ‘‘ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నారు. సీఎంవో పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.  మున్సిపల్ కార్పోరేషన్‌, ఫైర్‌ బిగ్రేడ్‌ వారికి బస్సులను శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు.  దీనికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ట్వీట్‌లో వెల్లడించారు. అయితే జిల్లా యంత్రాగం అధికారి ఒకరు మాట్లాడుతూ.. క్లోరిన్‌ను నీటితో కలిపి స్ప్రే చేశామని, అమానవీయంగా చేయలేదని తెలిపారు. వలస కూలీలు భారీగా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తుండటంతో, ప్రతి ఒక్కరిని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో ఇలా చేశామని అన్నారు.

ఈ సంఘటనపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయవతి స్పందించారు. ‘‘ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.... కరోనా వైరస్‌పై అందరం కలిసి పోరాడుతున్నాం. దయచేసి ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడవద్దు. కూలీలు ఇప్పటికే చాలా నష్టపోయారు. వారిపై రసాయనాలను పిచికారీ చేయవద్దు. ఇది వారిని రక్షించదు, ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది" అని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. వలస కూలీలపై ఇలా స్ప్రే చేయడం అన్యాయమని, క్రూరత్వానికి ఉదాహరణ అని మాయవతి అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలని కోరారు.


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని