Crime News: బెదిరించి మహిళపై దుండగుడి అత్యాచారం

ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు ప్రియుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానభారం భరించలేక బాధితురాలు,అతడు వికారాబాద్‌ సమీపంలో విషం తాగి

Updated : 18 Dec 2021 10:22 IST

బాధితురాలు, ప్రియుడి ఆత్మహత్యాయత్నం కేసులో వెలుగులోకి కొత్తవిషయం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు ప్రియుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానభారం భరించలేక బాధితురాలు,అతడు వికారాబాద్‌ సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌ఆర్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన మహిళ(32)కు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కూలిపనులు చేసుకునే మహిళ.. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి(22) పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వీరిద్దరూ కలుసుకొనేవారు. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. తిరిగి వెళుతుండగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇస్మాయిల్‌(23), మరో బాలుడు(17) అటకాయించారు. ప్రియుడి వద్ద ఫోన్‌ లాక్కొని బెదిరించారు. ఈ అలికిడితో మహిళ బయటకు వచ్చింది. మీ వివాహేతర బంధం బయటపెడతానని ఆమెను ఇస్మాయిల్‌ బెదిరించి.. గదిలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను బాలుడు వీడియోలో చిత్రీకరించాడు. నిందితులిద్దరూ వెళ్లిపోతూ.. ప్రియుడికి ఫోన్‌ ఇచ్చేశారు. ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకుందామని భావించిన మహిళ, ఆమె ప్రియుడు.. ఈనెల 14న ద్విచక్ర వాహనంపై వికారాబాద్‌ సమీపంలోని కండ్లపల్లి గేటు వద్ద నీలగిరి చెట్ల తోటలోకి వెళ్లారు. అప్పటికే దారిలో కొనుగోలు చేసిన విషం తాగారు. అంతకుముందు ప్రియుడు.. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని అతని సోదరుడికి ఫోన్‌లో చెప్పాడు. విషం తాగిన ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లగా.. సమాచారం అందుకున్న బాధితుడి సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. శుక్రవారం కోలుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఇస్మాయిల్‌, బాలుడి కోసం గాలిస్తున్నారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని