ఆస్పత్రి కట్టేందుకు అదనపుకట్నం తీసుకురా.. భర్త వేధింపులకు వైద్యురాలి ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలైన ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఎల్బీనగర్‌ పోలీసులు, ఆమె బంధువుల కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్‌కు చెందిన డా.వంగ భారతి(31)

Updated : 29 May 2022 07:29 IST

నాగోలు, న్యూస్‌టుడే: వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలైన ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఎల్బీనగర్‌ పోలీసులు, ఆమె బంధువుల కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్‌కు చెందిన డా.వంగ భారతి(31) స్త్రీ వైద్య నిపుణురాలు. కరీంనగర్‌లోని జమ్మికుంటకు చెందిన పిల్లల వైద్య నిపుణుడైన డా.కనకట్ట రమేష్‌తో ఆమెకు గతేడాది డిసెంబరు 9న వివాహం చేశారు. ఎకరం పొలం, రూ.5లక్షల నగదు, 20 తులాల బంగారం, ఇతర లాంఛనాలను వరకట్నంగా అందజేశారు. వీరు గత ఆర్నెల్లుగా ఎల్బీనగర్‌ సమీపంలోని సూర్యోదయనగర్‌లో ఉంటున్నారు. రమేష్‌ అత్తాపూర్‌లోని బటర్‌ఫ్లై చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో ఆన్‌కాల్‌పై ఉద్యోగం చేస్తున్నారు. కొన్నాళ్లు ఆన్యోన్యంగానే ఉన్నారు. తర్వాత ఇరువురు కలిసి ఆస్పత్రి పెడదామంటూ అదనపు కట్నం కోసం రమేష్‌ భార్యను వేధించసాగాడు. మద్యం తాగొచ్చి హింసించేవాడు. వేధింపులు తీవ్రమవడంతో 15 రోజుల క్రితం భారతి పుట్టింటికి వచ్చేసింది. వారం క్రితం పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పి ఆమెను కాపురానికి పంపారు. శుక్రవారం రాత్రి ఆమెకు తల్లిదండ్రులు ఫోనుచేసినా స్పందన లేదు. తిరిగి శనివారం ఉదయం రమేష్‌కు ఫోనుచేసి వాకబు చేయడంతో తాను ఆస్పత్రిలోనే ఉన్నానని, ఇంటికి వెళ్లి చెబుతానన్నాడు. తర్వాత ఆమె మరణించిందన్న సమాచారం తెలపడంతో భారతి కుటుంబసభ్యులు ఘొల్లుమన్నారు. ఎల్బీనగర్‌ పోలీసులు భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని ఆమె తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని