Hyderabad News: వ్యాపారంలో నష్టాలు.. ఏసీ బోగీల్లో చోరీలు

వ్యాపారాల్లో నష్టాలు రావడంతో.. రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికుల నగలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆర్పీఎఫ్‌ పోలీసులతో కలిసి సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు....

Updated : 09 Jun 2022 10:06 IST

ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్‌.. రూ.23 లక్షల సొత్తు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న నగలు, నిందితులతో  రైల్వే ఎస్పీ అనూరాధ తదితరులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: వ్యాపారాల్లో నష్టాలు రావడంతో.. రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికుల నగలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆర్పీఎఫ్‌ పోలీసులతో కలిసి సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.23 లక్షల విలువైన 55.1 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ కార్యాలయంలో.. డీఎస్పీ నర్సయ్య, ఇన్‌స్పెక్టర్లు శ్రీను, సరస్పత్‌తో కలిసి ఎస్పీ అనూరాధ వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం రంధి జిల్లా సరోవర్‌నగర్‌ వాసి రంజన్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌(63) వస్త్ర వ్యాపారం చేస్తుండేవాడు. ఉత్తర్‌పదేశ్‌లోని లఖ్‌నవ్‌ ప్రాంతానికి చెందిన రాజీవ్‌ రస్తోగి(42) కృత్రిమ జ్యుయలరీ వ్యాపారి. ఐదేళ్ల క్రితం రైల్లో హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. వ్యాపార అవసరాలకు నగరానికి వచ్చిన ప్రతిసారి అబిడ్స్‌లోని ఓ లాడ్జీలో కలిసే దిగేవారు. అనంతరం వ్యాపారాల్లో నష్టాలు రావడంతో ఇద్దరూ రైళ్లలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఏసీ కోచ్‌ల్లో రాకపోకలు సాగించే వారు అప్రమత్తంగా ఉండరని భావించి వాటిల్లో దొంగతనాలకు ఉపక్రమించారు. ఇద్దరూ ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. తోటి ప్రయాణికుల బ్యాగుల్లోని నగలు, నగదు కాజేయసాగారు. 2019లో ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారిగా చోరీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్‌ కుటుంబీకులతో కలిసి కోకోనాడ రైలులో ప్రయాణిస్తుండగా.. బ్యాగులోని 10 గ్రాముల బంగారు నగలు, విలువైన చీరలు చోరీ కావడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌతమి, హమ్‌సఫర్‌, చార్మినార్‌, ఈస్ట్‌కోస్ట్‌, నాగర్‌సోల్‌, కోకోనాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. వాటిపైనా ఫిర్యాదులు వచ్చాయి. కోకోనాడ రైల్లోని ఏసీ బోగీలో సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుల దృశ్యాలు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని పదో నెంబరు ప్లాట్‌ఫాంపై  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సికింద్రాబాద్‌ జీఆర్పీ పరిధిలో 11 చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని