రెండు గంటలు నరకయాతన!

కొళాయి ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొయ్యిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు రెండు గంటలపాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డారు.

Updated : 06 Aug 2022 06:57 IST

కోటనందూరు, న్యూస్‌టుడే: కొళాయి ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొయ్యిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు రెండు గంటలపాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డారు. కోటనందూరు మండలం బొద్దవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జలజీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ కొళాయిలు వేసేందుకు గ్రామంలోని ఇందిరమ్మకాలనీలో తెలంగాణ నుంచి వలస వచ్చిన కార్మికులు శుక్రవారం ఉదయం పనులు చేస్తున్నారు. కొళాయి ఏర్పాటుకు తీసిన గొయ్యిలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామానికి చెందిన సూరా నాగేశ్వరరావు అనే కార్మికుడు దిగాడు. ఒక్కసారిగా మట్టి జారిపడడంతో అందులో కూరుకుపోయాడు. అతడిని బయటకు లాగే క్రమంలో మరో కార్మికుడు ఆలకుంట బాలయ్య దిగగా ఇద్దరూ నేలలోనే కూరుకుపోయారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోగా స్థానికుల చొరవతో పొక్లెయిన్‌ సహకారంతో బాలయ్యను బయటకు తీశారు. అగ్నిమాపక వాహనంతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులంతా అక్కడికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పొక్లెయిన్‌ సాయంతో నాగేశ్వరరావు చుట్టూ ఉన్న మట్టిని తొలగించారు. అగ్నిమాపక సిబ్బంది గొయ్యిలోకి దిగి అతడిని తాళ్లతో బయటకు తీయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా బయటకు తీసిన బాలయ్యను తుని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తోటి కార్మికులు తెలిపారు. తుని గ్రామీణ సీఐ సన్యాసిరావు, సిబ్బందితో కలిసి వచ్చి కూరుకుపోయిన కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన బాలయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సహచర కార్మికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని