స్నేహితులతో కలిసి అపహరించి దాడి

అతడు చర్చిలో పాస్టర్‌.. వావివరసలు మరిచి బావమరిది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసిందని గ్రహించి, తన స్నేహితులను పంపి ఆయన్ను అపహరించాడు. ఆనక వారంతా బాధితుడిపై దాడిచేసి,

Updated : 29 Sep 2022 06:36 IST

బావమరిది భార్యతో పాస్టర్‌ వివాహేతర సంబంధం

ప్రశ్నించడంతో కారులో ఎక్కించుకెళ్లి నిర్బంధం

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భీమ్‌రెడ్ఢి చిత్రంలో

నిందితులు శిఖామణి, కిరణ్‌గౌడ్‌, మల్లేష్‌, అస్లంఖాన్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: అతడు చర్చిలో పాస్టర్‌.. వావివరసలు మరిచి బావమరిది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసిందని గ్రహించి, తన స్నేహితులను పంపి ఆయన్ను అపహరించాడు. ఆనక వారంతా బాధితుడిపై దాడిచేసి, బెదిరించడంతోపాటు చరవాణిలోని వీడియోలనూ డిలీట్‌ చేయించారు. ఎలాగోలా తప్పించుకున్న బాధితుడు స్వగ్రామానికి వెళ్లి తలదాచుకున్నాడు. 13 రోజుల తర్వాత నగరానికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాస్టర్‌తో పాటు సహకరించిన వారిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఎస్పీ భీమ్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టైలర్‌బస్తీకి చెందిన రాయని రాజు ఏడేళ్ల క్రితం భార్యతో కలిసి అమీన్‌పూర్‌కు చేరుకున్నాడు. స్థానిక న్యూసాయిభగవాన్‌ కాలనీలో ఉంటున్నాడు. రాజు కుమార్తెలిద్దరూ అమ్మమ్మగారి ఊరు ఏపీలోని మంగళగిరిలో ఉంటూ చదువుకుంటున్నారు. తన భార్య ప్రవర్తనలో తేడాను కొంతకాలంగా గమనిస్తోన్న రాజు.. ఈ నెల 5న బయటకెళ్లాడు. అంతకుముందే తన చరవాణిలో వీడియో రికార్డింగ్‌ ఆన్‌చేసి ఇంట్లో పెట్టాడు. రాత్రి ఇంటికి తిరిగొచ్చాక దాన్ని పరిశీలించాడు. రాజు బావ శిఖామణి బీరంగూడ మంజీరానగర్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న విషయం సదరు వీడియోలో వెలుగుచూసింది. భార్యను నిలదీయగా.. ఆమె చెప్పకుండానే మంగళగిరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం శిఖామణిని సైతం ప్రశ్నించాడు. దీంతో ఈ నెల 13న రాత్రి రాజు ఒంటరిగా ఉన్న సమయంలో శిఖామణి స్నేహితులు కిరణ్‌గౌడ్‌, మల్లేష్‌, సాయి, దినేష్‌, పర్శప్పలు ఇంట్లోకి ప్రవేశించి రాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని సమీపంలోని వెంచర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడనుంచి రామచంద్రాపురం తీసుకెళ్లి అస్లంఖాన్‌కు చెందిన ఫొటో స్టూడియోలో నిర్భందించారు. వారంతా కట్టెలతో రాజుపై దాడిచేస్తూ, అక్రమ సంబంధం విషయాన్ని బహిర్గతం చేస్తే చంపేస్తామని బెదిరించారు. రాజు చరవాణి తీసుకుని అందులోని రికార్డు చేసిన వీడియోనూ డిలీట్‌ చేశారు. మర్నాడు ఉదయం అక్కడి నుంచి రాజు తప్పించుకుని ఇల్లందుకు చేరుకున్నాడు. ఈ నెల 26న అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. ఎస్సై సుభాష్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెల్లడైంది. ప్రధాన సూత్రధారి శిఖామణితోపాటు కిరణ్‌గౌడ్‌, మల్లేష్‌, అస్లంఖాన్‌ను అరెస్ట్‌ చేసి అపహకరణకు ఉపయోగించిన కారు, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 128(బీ), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సాయి, దినేష్‌, పర్శప్పనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts