నెల రోజుల్లో పెళ్లి... అంతలోనే కబళించిన మృత్యువు

ఆ ఇంట పెద్దలు.. పిల్లలు రంగురంగుల మెహందీలు.. కొత్తదుస్తులు.. శుభలేఖల పంపిణీ...

Updated : 06 Dec 2022 04:14 IST

మహమ్మద్‌అలి (పాత చిత్రం)

బద్వేలు, న్యూస్‌టుడే: ఆ ఇంట పెద్దలు.. పిల్లలు రంగురంగుల మెహందీలు.. కొత్తదుస్తులు.. శుభలేఖల పంపిణీ... బ్యాండు మేళం మోగడానికి రోజులు దగ్గరికి వస్తున్నాయి.. నెల రోజుల్లో ఆ ఇంట పెళ్లి సందడి కనిపించనుంది. ఈలోపే విధి వక్రీకరించింది. బద్వేలు పట్టణంలోని సుమిత్రానగర్‌కు చెందిన మహమ్మద్‌ దంపతుల రెండో కుమారుడు మహమ్మద్‌ అలి (26) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయునిపల్లెలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మహమ్మద్‌ అలీ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. స్నేహితుడు దినేష్‌తో కలసి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొని ఆదివారం నెల్లూరు జిల్లాలోని  కలువాయికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కదిరినాయునిపల్లె వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం నుంచి పడిపోయారు. హెల్మెట్‌ ఉన్న దినేష్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. మహమ్మద్‌ అలీ అలాగే వెనక్కిపడిపోవడంతో తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు విలపించారు.


చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండల పరిధి మలకాటిపల్లె ఎస్సీకాలనీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గాలి ఓబులసుబ్బన్న అలియాస్‌ అంకయ్య (52) కడప సర్వజన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఈ నెల 2న విష ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి కడప సర్వజన ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు విచారణ చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు.


వివాహిత ఆత్మహత్య

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దకప్పలపల్లె గ్రామానికి చెందిన పి.సరోజ (23) కొండుగారిపల్లె వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఏఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఏఎస్సై వివరాల మేరకు... సరోజ భర్త నారాయణకు బావమరిదులకు మనస్పర్ధలు ఉన్నాయి. సోమవారం ఇంటి వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి చెందిన సరోజ గంగ కాలువలో దూకిందని తెలిపారు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.


ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే : నందిమండలం కొండగంగమ్మ ఆలయం సమీపంలో సోమవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందారని ఎస్‌.ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణానికి చెందిన సాయి కృష్ణ (22) సోమవారం సాయంత్రం వెల్లటూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. తెలిసిన వారి ద్విచక్రవాహనం తీసుకుని పులివెందులకు వెళ్తుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయారు. గాయపడిన అతన్ని స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని