భయపెట్టడంతోనే బాలిక ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురిచేయటంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు.

Updated : 09 Dec 2022 05:54 IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేశ్‌, సీఐ, చిత్రంలో నిందితులు

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురిచేయటంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. జడ్చర్ల ఠాణాలో సీఐ జమ్ములప్ప, బాలానగర్‌ ఎస్సై జయప్రసాద్‌లతో కలిసి మహబూబ్‌నగర్‌ డీఎస్పీ మహేశ్‌ వివరాలను వెల్లడించారు. బాలానగర్‌ మండలంలోని ఓ తండాలో బాలిక(15)ను కలిసేందుకు ఈ నెల 2న రాత్రి ఆమె ఇంటికి స్నేహితుడైన చిన్నరేవల్లికి చెందిన షానమోని శివ వచ్చాడు. రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వస్తున్న శివను బాలికకు బాబాయి వరసయ్యే అదే గ్రామానికి చెందిన నేనావత్‌ శ్రీను అలియాస్‌ డబ్బా శ్రీను, నేనావత్‌ శ్రీను(అడ్వకేట్‌), తిర్మలగిరికి చెందిన సింగమోని సుదర్శన్‌ పట్టుకొని కొట్టారు. శివ ఫోన్‌ తీసుకుని దాని ద్వారా బాలికకు నేనావత్‌ శ్రీను చాటింగ్‌ చేశాడు. బాలికను కలిసిన విషయంపై కుల పెద్దలకు చెప్పి పంచాయతీ పెడతామని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ. 10వేలు డిమాండు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి లేపే ప్రయత్నం చేయగా ఆమె తెరవలేదు. శివ వద్ద ఉన్న రూ.3వేలు తీసుకొని మిగిలిన డబ్బులు ఉదయం ఇచ్చి ఫోన్‌ తీసుకెళ్లాలని చెప్పారు. తర్వాత ముగ్గురు కలిసి బాలికను భయబ్రాంతులకు గురిచేశారు. ఆందోళనకు గురైన బాలిక ఈనెల 3న ఉదయం 6.20కి తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడింది. తర్వాత ఆమె బావకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెస్సేజ్‌ పంపింది. ఉదయం 7.20 నిమిషాలకు చున్నీతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డబ్బులు తీసుకొని ఉదయం తండాకు బయలుదేరిన శివ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి వెనుదిరిగాడు. శివ ఇంటికి రావటం వల్లనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని డబ్బా శ్రీను, నేనావత్‌ శ్రీను, సుదర్శన్‌ తండావాసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన బంధువులు శివ ఇంటితో పాటు వాహనం, తండాలోని డబ్బా శ్రీను, నేనావత్‌ శ్రీను ఇళ్లపైనా దాడి చేశారు. వాహనాలకు నిప్పంటించారు. బాలిక మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోస్టుమార్టం చేయకుండా కొందరు అడ్డుకొని ఆందోళనలు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని బంధువులు ఆరోపించటంతో ఫొరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నదానిపై నివేదిక రావాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులు ఎంపీటీసీ సభ్యుడు వెంకట్‌రాంనాయక్‌ను కలిసి సీఐ ముందు లొంగిపోయినట్లు చెప్పారు. నలుగురిని అరెస్టు చేసి సెల్‌ఫోన్లు, శివ వాడిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. బాలిక ఎస్టీ కావటంతో నిందితుడు శివపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవుతుందని వెల్లడించారు. దాడులతో ఆస్తులను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టి శాంతిభత్రలకు విఘాతం కలిగించినందుకు మరో నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని