ఒడిశా మంత్రి హత్య

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌ (61) కాల్పుల్లో మృతి చెందారు. ఆదివారం ఝార్సుగూడ జిల్లా బ్రజరాజనగర్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతుండగా ఏఎస్సై గోపాల్‌ చంద్ర దాస్‌ ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

Published : 30 Jan 2023 04:59 IST

కాల్పులు జరిపిన ఏఎస్సై
అధికారులపై కోపంతో  దారుణానికి ఒడిగట్టిన పోలీసు

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌ (61) కాల్పుల్లో మృతి చెందారు. ఆదివారం ఝార్సుగూడ జిల్లా బ్రజరాజనగర్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతుండగా ఏఎస్సై గోపాల్‌ చంద్ర దాస్‌ ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక తూటా మంత్రి ఛాతీలోకి దూసుకెళ్లింది. తోటి పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా గోపాల్‌చంద్ర దాస్‌ వారిపైనా తుపాకీ గురిపెట్టాడు. అక్కడ ఉన్నవారు చేతిని బలవంతంగా పైకి ఎత్తడంతో మరో రెండు రౌండ్లు గాల్లోకి కాల్చాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పకూలిపోయిన మంత్రిని మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి పర్యవేక్షణలో ఉంచగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మంత్రి చనిపోయినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. మరోవైపు మానసిక వ్యాధితోనే గోపాల్‌చంద్ర దాస్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతడి భార్య మీడియాకు వెల్లడించారు. పదేళ్లుగా ఔషధాలను వాడుతున్నట్లు తెలిపారు. గంజాం జిల్లా బ్రహ్మపురకు చెందిన గోపాల్‌కు రెండేళ్ల క్రితం బ్రజరాజనగర్‌కు బదిలీ అయిందని, ఎప్పుడు సెలవులు అడిగినా ఉన్నతాధికారులు ఇవ్వకపోవడంతో ఫోన్‌ చేసి బాధపడేవాడని ఆమె చెప్పారు. 1962 జనవరి 7న ఝార్సుగుడలో జన్మించిన నబ కిశోర్‌ దాస్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఝార్సుగుడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మరోసారి విజయం సాధించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేసి 2019లో బిజదలో చేరి మూడోసారి గెలిచి, సీఎం నవీన్‌ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని