Crime News: ప్రియురాలిపై 16 కత్తిపోట్లు.. కిరాతకంగా చంపిన ప్రియుడు

అప్పుడే విధులు ముగించుకుని ఆఫీసు వెలుపలికి వస్తున్న ఆమెకు ప్రియుడు ఎదురయ్యాడు.

Updated : 02 Mar 2023 09:52 IST

హతురాలిది కాకినాడ.. నిందితుడు శ్రీకాకుళం జిల్లా వాసి
బెంగళూరులో ఘోరం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: అప్పుడే విధులు ముగించుకుని ఆఫీసు వెలుపలికి వస్తున్న ఆమెకు ప్రియుడు ఎదురయ్యాడు. మాట్లాడాలంటూనే పక్కకు తీసుకెళ్లి ఒక్కసారిగా కత్తితో మీదకు రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతడి నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో అతను కత్తితో ఆమెను ఒకటా... రెండా... ఏకంగా 16 సార్లు కర్కశంగా పొడిచాడు. నెత్తుటి మడుగులో ఆమె కుప్పకూలిపోయింది. నిందితుడు ఆమె వద్దనే కొద్ది క్షణాలు కూర్చొన్నాడు. అనంతరం దూరంగా వెళ్లిపోయాడు.  ప్రేయసిపై ఓ ప్రేమోన్మాది దాడి చేసిన ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి  బెంగళూరు జీవనబీమా నగర పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. నేలకొరిగిన ఆమెను కాకినాడ నగర నివాసి లీలా పవిత్ర నలమాటి (28)గా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లివలస గ్రామానికి చెందిన దినకర్‌ బాణాల (29) అని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన లీలా పవిత్ర స్థానిక పాత విమానాశ్రయం రహదారిలోని మురుగేశ్‌పాళ్యలో ఉన్న ఒమెగా హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పనిచేస్తోంది. అక్కడికి సమీపంలోని దొమ్మలూరులో ఉన్న లూగిస్‌ హెల్త్‌కేర్‌ సంస్థలో దినకర్‌ ఉద్యోగి. వృత్తిరీత్యా ఆ ఇద్దరి మధ్య తొలినాళ్లలో స్నేహం.. ఆపై ప్రేమకు కారణమైంది. గత అయిదేళ్లుగా కొనసాగుతున్న వారి ప్రేమకు పెళ్లి ముగింపు అనుకుంటే... ఆమె పెద్దల వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యుల సూచనతో దినకర్‌కు దూరంగా ఉండేందుకు ఆమె ప్రయత్నించింది. ఇదే విషయంపై రెండు నెలల కిందట ఇద్దరూ ఓ సారి గొడవపడ్డారు. అప్పటి నుంచి లీలా మాట్లాడటం మానేసినట్లు సమాచారం. ఆమెతో మాట్లాడాలని దినకర్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలోనే నిందితుడు మానసిక ఒత్తిడికి లోనైనట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె పని చేస్తున్న సంస్థ వద్ద తచ్చాడుతూ అతడు కనిపించాడు. లీలా బయటకు రాగానే అనూహ్యంగా దాడికి దిగాడు. ఒక్కసారిగా కత్తితో విరుచుకుపడటంతో ఆమె ప్రతిఘటించలేక కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు అప్రమత్తమై లీలాను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. శరీరంపై పలుచోట్ల 16 కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లీలా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు బుధవారం రాత్రికి బెంగళూరుకు చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని మణిపాల్‌ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. లీలా పవిత్రను దినకర్‌ హత్య చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.


వెంటాడి.. వేధించి.. చంపేశాడు: లీలా తల్లి

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే-మసీదు సెంటర్‌: ‘నా కూతురు ఆదివారం ఫోన్‌ చేసింది.. దినకర్‌ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తూ నన్ను భయపెడుతున్నాడు.. యాసిడ్‌ పోసేస్తానని.. నగ్న ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆందోళనతో చెప్పింది. వేదన విని మేం అక్కడికి వస్తామని అంటే.. వద్దులే నేనే వచ్చేస్తా అంది.. అమ్మాయి రాలేదు కానీ.. ఆమె చావు కబురు మాకు చేరింది...’ అని లీలా పవిత్ర తల్లి రాధాకృష్ణవేణి కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఎక్కడుంటావో చెప్పు.. లొకేషన్‌ పెట్టకపోతే చంపేస్తానని బెదిరించాడని... భయపడి రాంగ్‌ లొకేషన్‌ పెట్టినా.. వదల్లేదని.. ఆఫీసు గేటు దగ్గర కాపు కాసి మరీ చంపేశాడని’ ఆమె బెంగళూరు నుంచి ‘ఈనాడు’తో ఫోన్‌లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘విశాఖలో ఎంఎస్‌సీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అందరూ ఒప్పుకొంటే చూద్దామని తన కుమార్తె చెప్పినప్పట్నుంచి.. ఏకాంతంగా కలవాలని.. అతను ఒత్తిడి తెచ్చేవాడు. మా అమ్మాయి దూరం పెట్టినప్పుడల్లా నా దగ్గర నువ్వు.. నేను కలిసి తీసుకున్న ఫోటోలు ఉన్నాయని బెదిరించేవాడని తన కూతురు తనతో చెబుతూ బాధపడింది...’  అని ఆమె వివరించారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పిందే గానీ.. ప్రాణాలు తీసేస్తాడని ఊహించలేదని తల్లి రాధాకృష్ణవేణి వాపోయారు.

‘హ్యాపీ’గా ఉంటుందనుకుంటే...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురానికి చెందిన నలమాటి అబ్బులుచౌదరి, రాధాకృష్ణవేణి దంపతులు 20 ఏళ్ల కిందట ఒక్కగానొక్క కూతురు లీలా పవిత్ర చదువు కోసం కాకినాడ వచ్చారు. కుమార్తెను ‘హ్యాపీ’ అని ముద్దుగా పిలిచేవారు. అల్లారు ముద్దుగా చూసుకునే కూతురి కోసం.. సొంత ఇల్లు, పొలాలు వదిలి కాకినాడ నగరంలోని జగన్నాథపురం ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కాకినాడలోనే చదివించి.. రెండేళ్ల ఎంఎస్‌సీ చదువుకు విశాఖలోని బుల్లయ్య కళాశాలలో చేర్పించారు. అదే కళాశాలలో చదువుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దినకర్‌ ఆమెకు పరిచయం అయ్యాడు.


ఇలాంటి పని ఎవరు చేసినా తప్పే: దినకర్‌ తండ్రి చినబాబు

నరసన్నపేట, న్యూస్‌టుడే: తన కుమారుడు బాణాల దినకర్‌ చిన్నప్పటి నుంచి ప్రతీ విషయానికి క్షణికావేశానికి గురవుతుంటాడని, చిరాకు పడుతుంటాడని, 12 రోజుల కిందటే బెంగళూరు వెళ్లాడని నిందితుడి తండ్రి చినబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తన కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామని, ఇలాంటి పని ఎవరు చేసినా తప్పేనని ఆయన పేర్కొన్నారు. తన ప్రేమ విషయాలేవీ ఎప్పుడూ తమకు చెప్పలేదని తల్లిదండ్రులు ముత్యాలమ్మ, చినబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లివలసకు చెందిన వీరి కుటుంబం విశాఖపట్నం వెళ్లిపోయి గత కొంతకాలంగా అక్కడే ఉంటోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని