Andhra News: దొంగనోట్ల నిందితుడు.. వీల్‌ఛైర్‌తో పారిపోయాడు!

దొంగనోట్ల కేసులో నిందితుడిగా ఉండి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి వీల్‌ఛైర్‌ సహా పరారైన ఉదంతమిది. పల్నాడు జిల్లా గురజాలలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది.

Updated : 09 Mar 2023 10:17 IST

పోలీసుల కళ్లు గప్పి  ఆసుపత్రి నుంచి మాయం

గురజాల, న్యూస్‌టుడే: దొంగనోట్ల కేసులో నిందితుడిగా ఉండి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి వీల్‌ఛైర్‌ సహా పరారైన ఉదంతమిది. పల్నాడు జిల్లా గురజాలలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడికి కాపలాగా ఉన్న ఏఆర్‌ కానిస్టేబుళ్లు.. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన అలేఖ్య... దొంగనోట్లు తయారు చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు గతేడాది నవంబరు 17న ఆయన ఇంటిపై దాడి చేశారు. తయారీ యంత్రాన్ని, దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అలేఖ్య ఇంటిపై నుంచి కిందకు దూకడంతో కాలు విరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో నిందితుడికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 3న నిందితుడితోపాటు దొంగనోట్ల తయారీలో భాగస్వామ్యం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి గురజాల కోర్టులో హాజరుపరిచారు. గాయపడిన అలేఖ్యను గుంటూరు ఆసుపత్రికి తరలించాలని, మిగిలిన ముగ్గురినీ గురజాల సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపాలని జడ్జి ఆదేశించారు. అప్పటి నుంచి గుంటూరు, గురజాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలేఖ్య చికిత్స పొందుతున్నాడు. అతనికి నలుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్‌గా ఉంటున్నారు. గురజాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అలేఖ్య పోలీసుల కళ్లుగప్పి వీల్‌ఛైర్‌ సహా పారిపోయాడు. ఆసుపత్రితో పాటు ఆ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడు ఎలా తప్పించుకున్నాడో తెలియడం లేదు. కుటుంబసభ్యులు లేదా స్నేహితుల సాయంతో పరారై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆసుపత్రిలో అలేఖ్య ఉన్న గదిని ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ పరిశీలించి, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యంపై ఆరా తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని