అప్పుల బాధతో ఇద్దరు కౌలురైతుల బలవన్మరణం

అప్పుల బాధతో ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనలు వికారాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

Published : 25 May 2023 04:36 IST

వికారాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఘటనలు

పరిగి, మామునూరు - న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనలు వికారాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా పోల్కంపల్లికి చెందిన పోతర్ల శంకరయ్య(35) గత వర్షాకాలంలో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. కౌలు రుణం చెల్లించడం భారంగా మారింది. దీనికితోడు పాత ఇంటి మరమ్మతు చేయించుకున్నాడు. నష్టాలను అధిగమించేందుకు వ్యాపారం పట్ల మొగ్గుచూపినా అందులోనూ కలిసిరాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పురుగుల మందు తాగుతున్నట్లు సెల్పీ వీడియో తీసుకుని గ్రామంలో పలువురికి వాట్సప్‌లో పంపారు. పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో ఉన్నట్లు గుర్తించి పలువురు అక్కడికి చేరుకున్నారు. ఆయన్ను వికారాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మరో ఘటనలో.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రామెత్తుతండాకు చెందిన మాలోతు బాలు(40) నాలుగేళ్లుగా బొల్లికుంటలో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలకు మొక్కజొన్న పంటంతా దెబ్బతింది. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందిన ఆయన మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని