London: హైదరాబాద్‌ విద్యార్థిని లండన్‌లో దారుణ హత్య

భవిష్యత్తుపై గంపెడాశతో ఉన్నత విద్య చదివేందుకు లండన్‌ వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థిని తేజస్విని బ్రెజిల్‌ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. కోర్సు పూర్తిచేసుకుని త్వరలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగింది.

Updated : 15 Jun 2023 08:27 IST

తన గదిలో ఉండగా కత్తితో దాడిచేసిన బ్రెజిల్‌ దేశస్థుడు
అడ్డుకున్న మరో యువతిపైనా దాడి
పోలీసుల అదుపులో నిందితుడు

తుర్కయంజాల్‌ పురపాలిక, న్యూస్‌టుడే: భవిష్యత్తుపై గంపెడాశతో ఉన్నత విద్య చదివేందుకు లండన్‌ వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థిని తేజస్విని బ్రెజిల్‌ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. కోర్సు పూర్తిచేసుకుని త్వరలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో రంగారెడ్డి జిల్లా సాగర్‌ రహదారి తుర్కయంజాల్‌ పరిధి శ్రీరాంనగర్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవి దంపతులు అయిదేళ్లుగా శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఎలక్ట్రీషియన్‌. వీరి కుమారుడు పవన్‌కుమార్‌ ఎంబీఏ పూర్తిచేసి అయిదేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె తేజస్వినీరెడ్డి(27) హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి, మూడేళ్ల క్రితం ఎంఎస్‌ చేసేందుకు లండన్‌కు వెళ్లింది. అక్కడి గ్రీన్‌ విచ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును ఇటీవలే పూర్తిచేసింది.

తలుపు తట్టి మరీ కత్తితో పొడిచిన ఆగంతకుడు

ఎంఎస్‌ చేస్తున్న సమయంలో తేజస్విని గ్రీన్‌విచ్‌ విశ్వవిద్యాలయం సమీపంలోనే బంధువులతో కలిసి నివాసముండేది. మూడు నెలల క్రితం కోర్సు పూర్తయిన తర్వాత నార్త్‌ లండన్‌లోని వెంబ్లీ పట్టణం నీల్డ్‌ క్రెసెంట్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ షేరింగ్‌ ఫ్లాట్‌కు మారింది. అక్కడ మరో స్నేహితురాలితో కలిసి నివాసముంటోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బ్రెజిల్‌కు చెందిన యువకుడు భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తేజస్విని ఉంటున్న గది తలుపు తట్డాడు. ఆమె తలుపు తీయగానే ఒక్కసారిగా కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితురాలిపైనా దాడికి దిగాడు. కత్తిపోట్లతో తీవ్రగాయాలై తేజస్విని అక్కడికక్కడే మృతిచెందింది. మరో యువతి స్వల్ప గాయాలతో అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ‘‘ఇద్దరు మహిళలపై దాడి జరిగినట్టు స్థానికులు సమాచారం ఇచ్చారు. తాము అక్కడికి వెళ్లే సమాయానికే ఓ యువతి మరణించి ఉంది. గాయపడిన మరో యువతిని ఆసుపత్రికి తరలించాం. హత్యతో సంబంధం ఉందనే అనుమానంతో 24 ఏళ్ల కెవిన్‌ ఆంటోనియో డి మోరీస్‌ సహా మరో మహిళను అదుపులోకి తీసుకున్నాం. విచారణ తర్వాత మహిళను విడుదల చేశాం. కెవిన్‌ ఆంటోనియో డి మోరీస్‌ మా అదుపులోనే ఉన్నాడు’’ అని నార్త్‌ లండన్‌ పోలీసులు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని, యువతులపై దాడి జరగడానికి గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు. మృతురాలి గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డుల ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్టు చెప్పారు.

పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో..

లండన్‌లో కుమార్తె హత్యకు గురయిందన్న సమాచారాన్ని బుధవారం ఉదయం తెలుసుకున్న తేజస్విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కోర్సు పూర్తయిన నేపథ్యంలో బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నామని, సంబంధాలు కూడా చూస్తున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఇంటికి వచ్చేయమని చెప్పాం. అందుకే ఇటీవల ఉద్యోగం కూడా మానేసింది. వారంలో భారత్‌కు తిరుగుప్రయాణమవుతానని చెప్పింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. అనూహ్యంగా ఆగంతకుని చేతిలో హత్యకు గురైందని’ వారు రోదిస్తున్నారు.

మృతదేహాన్ని త్వరగా రప్పిస్తాం: కేటీఆర్‌

బాధిత కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. అక్కణ్నుంచే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. లండన్‌లోని భారత హైకమిషనర్‌ను సంప్రదించి సాధ్యమైనంత త్వరగా ఆమె భౌతిక దేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తానని కేటీఆర్‌ పేర్కొన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని