Nellore: ‘చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తాం!’

‘రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్‌ మోగించడమే ఆర్టీసీ డ్రైవరు తప్పయింది. బస్సు వెనకాలే వెంబడించి అడ్డుకున్నారు.

Updated : 28 Oct 2023 08:26 IST

ద్విచక్రవాహనం అడ్డుతీయాలని హారన్‌ కొట్టడమే తప్పయింది
నెల్లూరు జిల్లాలో ఆర్డీసీ డ్రైవర్‌పై విచక్షణరహితంగా దాడి

ఈనాడు, నెల్లూరు: కావలి, న్యూస్‌టుడే: ‘రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్‌ మోగించడమే ఆర్టీసీ డ్రైవరు తప్పయింది. బస్సు వెనకాలే వెంబడించి అడ్డుకున్నారు. బస్సులో నుంచి కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో కడుపులో తన్నారు. పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవరు కిందపడినా.. వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఆ దారుణ ఘటనను చిత్రీకరిస్తున్న వారి చరవాణులూ లాక్కున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16జడ్‌ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంకురోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో బస్సు డ్రైవరు బి.ఆర్‌.సింగ్‌ హారన్‌ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుకవైపు ఆగిన వాహనాలు హారన్‌ మోగించడం, అక్కడే ఉన్న ఒకటో పట్టణ పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన మిత్రులైన దేవరకొండ సుధీర్‌ తదితరులకు సెల్‌ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. మొత్తం 14 మంది టీఎన్‌ సీ9 1612 నంబరు కారులో ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవరును కిందకి దించి దాడికి పాల్పడ్డారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో దేవరకొండ సుధీర్‌, శివారెడ్డి, మల్లి, విల్సన్‌, కిరణ్‌లతో పాటు మొత్తం పది మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయి. సస్పెక్ట్‌షీట్‌ తెరిచి ఉంది. కావలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెంగళరావునగర్‌లో వీరు ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

* నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ప్రకటనలో తెలిపారు.

* నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదరరావు, నరసయ్య హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని