Girl Kidnap: బాలిక కిడ్నాప్‌.. రూ.10 లక్షల డిమాండ్‌

ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌ అంశం సుఖాంతమైంది. పోలీసుల విస్త్రృత తనిఖీలు చేయడంతో భయపడిన కిడ్నాపర్లు ఆమెను ఓ గ్రౌండ్‌లో వదిలేసి పరారయ్యారు.

Updated : 28 Nov 2023 16:40 IST

కొల్లాం: ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌ (Girl Kidnap in Kerala) ఘటనలో 21 గంటల తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. సోమవారం సాయంత్రం నుంచి కేరళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కిడ్నాపర్లు.. కొల్లాం ఆశ్రమం గ్రౌండ్‌లో బాలికను వదిలపెట్టి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల సమయంలో కొల్లాంలోని (Kollam) పోయప్పల్లిలో ట్యూషన్‌కు వెళ్తున్న బాలికను దుండగులు అపహరించారు. ఆమె పక్కనే ఉన్న 8 ఏళ్ల సోదరుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పక్కకి విసిరేయడంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆ బాలుడు జరిగిన విషయాన్ని ఇంటికొచ్చి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి నిమిషాల వ్యవధిలోనే దుండగులు వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు, కొద్దిసేపటికి మళ్లీ ఫోన్‌ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే.. చిన్నారి ప్రాణాలు తీస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరించారు.

దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గంటల కొద్దీ గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకపోయింది. ఈలోగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొందరు యువకులు పోయప్పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కొల్లాం, పథనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు కిడ్నాపర్లు, బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్‌కాల్స్‌ కూడా స్థానిక ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో భయపడిన కిడ్నాపర్లు బాలికను కొల్లాం ఆశ్రమం గ్రౌండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు.

బాధిత బాలిక సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు తెల్లరంగు కారులో వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. బాలుడు చెప్పిన వివరాలు,  మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు రెండు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పని చేస్తున్నారు. బాలికను కిడ్నాప్‌ చేయడానికి గల కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు