Ghaziabad: భర్తను చంపి ప్రియుడి ఇంట్లో పాతిపెట్టి.. నాలుగేళ్లకు బయటపడ్డ నేరం!

పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆపై, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ప్రియుడి ఇంట్లోనే లోతైన గుంతలో పాతిపెట్టింది. ఇది జరిగిన నాలుగేళ్లకు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

Published : 15 Nov 2022 01:01 IST

లఖ్‌నవూ: దిల్లీలో ఓ యువతిని హత్యచేసి, ముక్కలుగా నరికి, ఆయా ప్రాంతాల్లో విసిరేసిన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మరో ఘటన బయటపడింది. పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆపై, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ప్రియుడి ఇంట్లోనే లోతైన గుంతలో పాతిపెట్టింది. ఇది జరిగిన నాలుగేళ్లకు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి ఘాజియాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన భర్త చంద్రవీర్‌ను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. వారిని తప్పుదోవ పట్టించేందుకుగానూ.. ఇది తన భర్త సోదరుడి పనేనంటూ ఆమె అప్పట్లో పలుమార్లు ఆరోపించారు.

ఇటీవలే ఈ కేసు విషయంలో పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా కూపీ లాగగా.. అసలు విషయం బయటపడింది. మహిళ, ఆమె ప్రియుడు అరుణ్‌ కలిసి.. 2018లోనే చంద్రవీర్‌ను తుపాకీతో కాల్చి చంపినట్లు తేలింది. ఆపై మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలుగా నరికి.. అరుణ్ ఇంట్లోనే ఏడడుగుల గుంతలో పాతిపెట్టారు. పైన సిమెంట్ ఫ్లోరింగ్‌ వేసి, అరుణ్ ఎప్పటిలాగే నివసించాడు. తాజాగా, పోలీసులు గుంతను తవ్వి.. అస్థిపంజరాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పథకం ప్రకారం కొన్ని రోజులు ముందుగానే గొయ్యిని సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దుర్వాసన రాకుండా ఉండేందుకుగానూ దాన్ని లోతుగా తవ్వినట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ దీక్షా శర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని