‘డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌’తో బురిడీ.. ఐటీ అధికారుల ముసుగు దొంగల చోరీ కేసులో కీలక విషయాలు

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల ముసుగులో చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు.

Updated : 29 May 2023 19:46 IST

రెజిమెంటల్‌ బజార్‌: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల ముసుగులో చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జాకీర్‌, రహీమ్‌, ప్రవీణ్‌, అక్షయ్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. చోరీ చేసిన తర్వాత నిందితులు మహారాష్ట్రకు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో నిందితులు బస చేశారు. 24న ఉదయం 7.30 గంటల సమయంలో నలుగురు, మధ్యాహ్నం 3.30 గంటలకు మరో నలుగురు లాడ్జ్‌లో బస చేశారు. రెండు బృందాలుగా వచ్చి రెండు వేర్వేరు గదుల్లో బస చేశారు. లాడ్జ్‌ మేనేజర్ కు ఎలాంటి అనుమానం రాకుండా ఒకరికొకరు పరిచయం లేనట్లుగా నిందితులు వ్యవహరించారు. తమ వద్ద ఆధార్‌ జిరాక్స్ లేదని.. వాట్సాప్‌ చేస్తామని చెప్పడంతో మేనేజర్ సరే అన్నాడు. మేనేజర్ తిరుపతికి ఆధార్‌ కార్డులు వాట్సాప్ చేశారు. సరేనని.. అప్పటికప్పుడు వారు చెప్పిన వివరాలు రాసుకున్నాడు. వాట్సాప్ చేసిన ఆధార్ కార్డులు తర్వాత ప్రింట్ తీసుకుందామని అనుకున్నాడు మేనేజర్‌.

కానీ చోరీ చేసేందుకు వెళ్లి ముందు రోజు వాట్సాప్ చేసిన ఆధార్ కార్డులను డిలీట్‌ ఫర్ ఎవ్‌రీ వన్‌ కొట్టారు. దీంతో అతనికి వచ్చిన రెండు ఆధార్‌ కార్డులు వాట్సాప్‌ నుంచి మాయమయ్యాయి. వచ్చిన వెంటనే ఆధార్ కార్డుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేయలేదని పోలీసులకు లాడ్జ్ మేనేజర్ తెలిపాడు. 27న ఉదయం 10.30గంటలకు తన (నిందితుల్లో ఒకరు) తల్లి చనిపోయిందని మేనేజర్‌కు చెప్పి హడావుడిగా లాడ్జ్‌ గదిని ఖాళీ చేశారు. మూడు రోజులకు గాను రూ.3వేలు చెల్లించి లాడ్జ్‌ నుంచి రెండు బృందాలు వెళ్లిపోయాయి. లాడ్జ్‌కి 750 మీటర్ల దూరంలోనే చోరీ జరిగిన దుకాణం ఉంది. పక్కా ప్రణాళికతోనే రెక్కీ చేసి మరీ చోరీ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది..?

పాట్‌ మార్కెట్‌లోని నవకార్‌ కాంప్లెక్స్‌ నాలుగో అంతస్తులో బాలాజీ గోల్డ్‌షాప్‌లో శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆ దుకాణంలోకి ప్రవేశించారు. తాము ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులమంటూ ఐడీ కార్డులు చూపి.. బంగారు దుకాణంలో అవకతవకలు జరిగాయంటూ హడావుడి చేశారు. పనివాళ్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని, గదిలో బంధించి.. 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీ సంచలనం రేకెత్తించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని