Insurance money: బీమా డబ్బుల కోసం తండ్రినే యాక్సిడెంట్‌ చేయించాడు!

ఇన్సురెన్స్‌ సొమ్ము కోసం తన తండ్రినే హత్య చేయించాడో వ్యక్తి. పక్కా ప్రణాళికతో వాహనంతో ఢీకొట్టించి చంపించాడు.

Published : 19 Nov 2022 16:22 IST

ప్రతీకాత్మక చిత్రం

బర్వాని: సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది. ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం కన్న కొడుకే తన తండ్రిని హత్య చేయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం వాహనంతో ఢీకొట్టించి చంపించాడు. ఈ పని కోసం కాంట్రాక్ట్‌ కిల్లర్లను నియమించి ఘాతుకానికి ఒడిగట్టాడు. పాపం పండడంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో చోటుచేసుకుంది.

బర్వానీ జిల్లా సెంద్వా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నవంబర్‌ 10న ఓ ప్రమాదం జరిగింది. గుర్తు తెలీని వాహనం ఢీకొట్టిన ఘటనలో 52 ఏళ్ల వ్యక్తి మరణించారు. దీనిపై మరణించిన వ్యక్తి కుమారుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తొలుత ప్రమాదం అని భావించిన పోలీసులు.. తీరా సంఘటనా స్థలిని పరిశీలించాక ఇది ముమ్మాటికీ హత్యేనన్న నిర్ధారణకు వచ్చారు.

ప్రమాద స్థలిలో ఉన్న సీసీటీవీని సందర్శించగా ఈ విషయం బయటకొచ్చింది. ప్రమాదానికి ముందు అదే ప్రదేశంలో ఢీకొట్టిన వాహనం పలుమార్లు చక్కర్లు కొట్టడం పోలీసులు గమనించారు. దీంతో తొలుత కరణ్‌ శిందే అనే వ్యక్తిని అనుమానితుడిగా పుణెలో అతడిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తనదైన శైలిలో విచారించాక అసలు విషయం బయటకొచ్చింది. తండ్రిని చంపించేందుకు కుమారుడే సుపారీ ఇచ్చినట్లు వెల్లడైంది. 

రూ.10 లక్షల బీమా డబ్బుల కోసం ఇదంతా చేసినట్లు కుమారుడే తర్వాత అంగీకరించాడు. ఇందులో రూ.2.5 లక్షలు సుపారీ తీసుకున్న వ్యక్తులకు ఇవ్వడానికి గానూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లే అలవాటున్న తన తండ్రిని అదే సమయంలో కడతేర్చేందుకు పన్నాగం పన్నాడు. వాకింగ్‌ బయల్దేరిన విషయాన్ని సుపారీ తీసుకున్న వ్యక్తులకు ఫోన్‌లో చేరవేసి హత్య చేయించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు సహా మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని