Jammu Kashmir: పెళ్లికి నిరాకరించిందని.. మహిళను చంపి.. ముక్కలుగా నరికిన వ్యక్తి!

దిల్లీలో శ్రద్ధా వాకర్‌ హత్య తరహాలో జమ్ము కశ్మీర్‌(Jammu kashmir)లో ఓ వ్యక్తి మహిళను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చి పెట్టాడు. 

Published : 12 Mar 2023 19:21 IST

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌(Jammu kashmir)లో దారుణం చోటుచేసుకుంది. బుడ్గామ్‌ (Budgam) జిల్లాలో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. దిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్య ఘటన తరహాలో హత్య అనంతరం బాధితురాలి శరీరాన్నిముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో పూడ్చిపెట్టాడు. దీంతో నిందితుణ్ని ఉరి తీయాలని బాధితురాలి తరపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 7 తేదీన సోయ్‌బగ్‌ (Soibug) గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ మార్చి 7న కోచింగ్‌ క్లాసుల కోసం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో మార్చి 8న ఆమె సోదరుడు తన్వీర్‌ అహ్మద్‌ ఖాన్ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరి కనిపించకుండా పోవడానికి అదే గ్రామానికి చెందిన షాబిర్‌ అహ్మద్‌ వానీ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో షాబిర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 

మహిళను నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడు గతంలో ఆమెను వివాహం చేసుకునేందుకు పలుమార్లు సంప్రదించగా.. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. హత్య అనంతరం ఆధారాలు దొరకుండా ఉండేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పూడ్చి పెట్టినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం శరీర భాగాల్ని స్వాధీనపరుచుకుని, వైద్య పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు, కొద్ది రోజుల క్రితం కంప్యూటర్‌ కోర్సులో చేరిందని, ఆమెకు ఆగస్టులో వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలో దారుణం జరిగిందని ఆమె సోదరుడు వాపోయాడు. నిందితుణ్ని కఠినంగా శిక్షిచాలని బాధితురాలి తరపు బంధువులు రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని