
‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’
ఇంటర్నెట్‌డెస్క్: హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ద్విచక్రవాహనంపై జాగ్రత్తగా వెళ్లినా కూడా ఒక్కోసారి ఇతరుల అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా ఓ ప్రబుద్ధుడు ఉదయాన్నే మద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మత్తులో తూగిపోతూ, వేగంగా వెళ్తున్న కారులకు, బైక్‌లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చేవెళ్లలోని ఇబ్రహీంపల్లి గేట్ వద్ద సీసీ టీవీలో రికార్డయిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్ ఖాతాలో పంచుకుంది. పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్, బ్రహ్మానందం ఇమోజీలు జోడించి, ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మద్యం సేవించి బండి నడుపుతున్న వ్యక్తిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఇక ‘అతి వేగం ఎప్పుడైనా ప్రమాదకరమే, పైగా సరకు రవాణా చేసే వాహనాల్లో ప్రయాణించడం మరింత ప్రమాదం’ అంటూ మరో వీడియోను కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు పంచుకున్నారు. ఆ వీడియో నవ్వులు పూయిస్తోంది.