UP: గ్యాంగ్‌స్టర్‌ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్‌..!

ఉత్తర్‌ప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ను (Atiq Ahmed) గుజరాత్‌ జైలు నుంచి  ప్రయాగ్‌రాజ్‌ జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు వెళ్తోన్న వాహనం ఓ ఆవును ఢీ కొట్టడం కలకలం రేపింది.

Published : 27 Mar 2023 15:45 IST

దిల్లీ: వందకుపైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ను (Atiq Ahmed) గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UP) ప్రయాగ్‌రాజ్‌కు యూపీ పోలీసులు తరలిస్తున్నారు. ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని భయపడుతూ జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిందితుడు అతీక్‌ (Atiq Ahmed) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని తీసుకెళ్తున్న పోలీస్‌ కాన్వాయ్‌కు మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. వాహన శ్రేణికి ఓ ఆవు అడ్డురావడంతో అతీక్‌ ప్రయాణిస్తోన్న వాహనం దాన్ని ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు కాన్వాయ్‌ను అక్కడే నిలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఓ కిడ్నాప్‌ కేసులో తీర్పు వెలువడనున్న సందర్భంగా ఈ నెల 28న ప్రయాగ్‌రాజ్‌ న్యాయస్థానంలో నిందితుడిగా అహ్మద్‌ను హాజరుపరచాల్సి ఉంది. దీంతో గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలిస్తున్నారు. అయితే, కోర్టులో హాజరుపరిచే నెపంతో తనను పోలీసులు తీసుకువెళ్తున్నారని, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారిలోనే తనను హతమార్చే అవకాశం ఉందని అహ్మద్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలోనూ హత్య, హత్య అంటూ విలేకరుల ముందు భయంతో కేకలు వేశాడు. ఈ క్రమంలోనే అతడి వాహన శ్రేణి ప్రమాదానికి గురికావడం కలకలం రేపింది. వాహనం ఢీకొట్టడంతో ఆ మూగజీవి రోడ్డు డివైడర్‌పై పడిపోవడంతో అది మరణించి ఉండవచ్చని భావించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అది లేచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇలా నిందితుడికి ఎన్‌కౌంటర్‌ భయం నెలకొన్న వేళ.. న్యాయస్థానంలో వచ్చే అన్ని తీర్పులను అంగీకరిస్తామని ఆయన సోదరి అయేషా నూరీ వెల్లడించారు. కేవలం ఆయన ప్రాణాలపైనే ఆందోళన చెందుతున్నామన్నారు. గుజరాత్‌ నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తోన్న పోలీసు కాన్వాయ్‌ను అయేషా నూరీ అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసుల బృందంతో కూడిన కాన్వాయ్‌ నిందితుడిని తరలిస్తోంది. సుమారు 25 గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రం ఈ కాన్వాయ్‌ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని