Hyderabad: పెట్రోల్‌ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

సుచిత్ర నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు పెట్రోల్‌ బంకు సమీపంలోకి రాగానే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన బాలానగర్‌ ఐడీపీఎల్‌ వద్ద జరిగింది.

Updated : 02 Jun 2023 20:31 IST

బాలానగర్‌: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్‌ బాలానగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.  సుచిత్ర నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న బస్సు ఐడీపీఎల్‌ సమీపంలోకి రాగానే ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపేసి కిందికి దిగాడు.   క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. బస్సు నిలిపిన చోట పెట్రోల్‌ బంకు ఉండడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. నడిరోడ్డుపై బస్సు దగ్ధం కావటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటలకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురూ సురక్షితంగా బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని