Hyd Crime News: రహస్య పెళ్లిని బహిర్గతం చేయాలన్న ఒత్తిడితోనే..

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని లెమన్‌ ట్రీ హోటల్‌లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న చోటుచేసుకుంది.

Updated : 30 Jul 2021 13:51 IST

మాదాపూర్‌:  మాదాపూర్ పీఎస్ పరిధిలోని లెమెన్ ట్రీ హోటల్‌లో జరిగిన జంట మరణాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే యువతిని హత్య చేసి ఆ తర్వాత యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కోస్గి మండలం లగచర్లకు చెందిన సంతోషను, బోంరాస్ పేట మండలం హకీంపేటకు చెందిన రాములు బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత యువతి చున్నీతో రాములు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై హోటల్ సిబ్బంది మాదాపూర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు వివరాలను మాదాపూర్‌ సీఐ రవీందర్‌ మీడియాకు వెల్లడించారు. 

సంతోష, రాములు పదో తరగతి వరకు బోంరాస్ పేట మండలం హకీంపేటలో చదువుకున్నారు. సంతోష ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతూ గత ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటోంది. కారు డ్రైవింగ్ చేస్తున్న రాములు కూడా మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చాక ఇరువురు కలుసుకున్నారు. వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. సంతోషను పెళ్లి చేసుకుంటానని.. రాములు తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ కులాంతర వివాహానికి రాములు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సంతోష ఇంట్లో మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో నెల క్రితం రాములు, సంతోషను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వీరు పెళ్లి చేసుకున్నట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులకు తెలీదు. దీంతో పెళ్లి గురించి అందరికీ చెప్పాలని సంతోష.. రాములుపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకు పెళ్లి గురించి చెప్పలేక రాములు ఒత్తిడికి గురయ్యాడు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం రాములు, సంతోష కలిసి లెమెన్ ట్రీ హోటల్‌లో దిగారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంతోషను గొంతు కోసి రాములు హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వివరించారు. 

రాములు తన ప్రేమ పెళ్లి గురించి నెల క్రితమే ఇంట్లో చెప్పాడని మృతుడి సోదరుడు సాయి తెలిపాడు. అమ్మాయిది వేరే కులం కావడంతో తమ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పాడు. అయితే, గత రెండు రోజుల నుంచి తన అన్న రాములు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉందని, మంగళవారం ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడాడని సాయి తెలిపాడు. ఫోన్‌ పోయినట్టుగా తమకు చెప్పాడన్నారు. అయితే వీరు పెళ్లి చేసుకున్నట్లు తమకు తెలీదన్నారు. తన అన్న చాలా మంచివాడని.. ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ సాయి కన్నీరు మున్నీరుగా విలపించాడు. 

రాములుని పెళ్లి చేసుకుంటానని సంతోషి నెల రోజుల క్రితమే ఇంట్లో చెప్పిందని మృతురాలి సోదరుడు రాఘవేందర్‌ తెలిపాడు. ఇరువురి కులాలు వేరయినప్పటికీ పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. అయితే, రాములు కుటుంబం ఒప్పుకోలేదన్నారు. కులాంతర వివాహం వద్దని చెప్పారన్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని రాఘవేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని