Tollywood Drugs Case: ముగిసిన కెల్విన్‌, నందు విచారణ

మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు నందుతో పాటు మాదక ద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7గంటల పాటు ప్రశ్నించిన అధికారులు..

Published : 08 Sep 2021 01:13 IST

హైదరాబాద్‌: మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు నందుతో పాటు మాదక ద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. నందు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అందులో అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. నందు ఈ నెల 20వ తేదీన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. ముందుగా వస్తానని ఈడీ అధికారులను కోరాడు. దీనికి అంగీకరించిన అధికారులు ఈ రోజు విచారణకు రావాలని సూచించారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న నందును ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు కెల్విన్, వాహబ్, ఖుద్దూస్‌ల ఇంటికి వెళ్లారు. ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కెల్విన్, వాహబ్, ఖుద్దూస్‌లను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వీళ్ల ఖాతాలోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి.. ఎవరు పంపించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే కొనసాగింది. 2017 జూలై నెలలో కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రూ.30 లక్షలు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని చరవాణిలో ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. టాలీవుడ్‌ నటుడు దగ్గుబాటి రానా రేపు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని